Monday, December 23, 2024

కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణలో కొనసాగుతున్న సుపరిపాలన

- Advertisement -
- Advertisement -
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సుపరిపాలన కొనసాగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు.

మంత్రితోపాటు జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, కలెక్టర్ అమోయ్‌కుమార్, అదనపు కలెక్టర్లు ఏనుగు నరసింహారెడ్డి, అభిషేక్ అగస్త తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్యదక్షత, ముందు చూపుతో చేపట్టిన జిల్లాల పునర్విభజనతో ప్రజలకు పాలనా సౌలభ్యం పెరిగి ఇబ్బందులు తొలగాయని అన్నారు. స్వరాష్ట్రంలో ప్రజలకు జవాబుదారీగా ఉంటూ అత్యంత పారదర్శకమైన పాలన అందించేందుకు ఆయా శాఖలను పునర్వవస్థీకరించి అధికారాలు, అవసరమైన నిధులు అందజేసి బలోపేతం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 2016 అక్టోబర్ 11న ఏర్పడిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అతని కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధ్ది సాధించి మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.

నూతనంగా కీసర రెవెన్యూ డివిజన్, తొమ్మిది మున్సిపాలిటీలు, నాలుగు కార్పొరేషన్లు, 14 మండలాలు, 61 గ్రామ పంచాయతీలలో ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుతున్నాయని అన్నారు. జిల్లాలో నాలుగు గ్రామీణ మండలాలకు తోడు సీఎం కేసీఆర్ మూడుచింతలపల్లిని కొత్త మండలంగా ఏర్పాటు చేసి ఐదు గ్రామాలను దత్తత తీసుకొని రూ.69 కోట్లతో అభివృద్ధ్ది చేసినట్లు మంత్రి తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజల సౌలభ్యం కోసం పాలన వ్యవస్థను వికేంద్రీకరించి అందిస్తున్న సుపరిపాలనను చూసి దేశం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందని అన్నారు.

జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు, సంస్కరణలు నేడు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అన్నారు. అనంతరం మేడ్చల్ జిల్లా సుపరిపాలన కరపత్రాలను మంత్రి, కలెక్టర్, జడ్పీ చైర్మన్ ఆవిష్కరించారు. అంతకుముందు జిల్లాలో కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్లు, గ్రామ పంచాయతీల సర్పంచులు తమ అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, డిసిపి జానకి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News