భద్రాద్రి కొత్తగూడెం : ప్రధాని మోడీ ఆర్థిక దోపిడీ దారులకు ప్రతినిధిగా పనిచేస్తున్నారని, ఆదాని ఆయన కవల సోదరులని దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరణ, విక్రయాలు చేసి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారని సిపిఐ పార్టీ అగ్రనేతలు కొనకండ్ల నారాయణ, చాడా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియంలో ప్రజా గర్జన పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో వారు మాట్లాడుతూ మతోన్మాదంతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాముడు పేరుతో పబ్బం గడుపుకుంటూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్న బిజెపిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. నాలుగు వేల సంవత్సరాల క్రితం పుట్టిన హిందూ మతానికి వంద సంవత్సరాలు కూడా నిండని బిజెపి రాముడు గురించి చెపుతుందని ఎద్దేవా చేశారు.
దేశంలో కమ్యునిస్టుల చరిత్ర ముగిసిందని చెపుతున్న పార్టీలు నాలుగు రాష్ట్రాల్లో బలమైన స్థానంలో ఉన్న తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మాపై ఉమ్మెస్తే ఆకాశంపై వేసినట్లేనని తేల్చి చెప్పారు. రోజుకు, పూటకు ఒక పార్టీ మార్చే వారు కూడా తమకు నీతులు చెపుతున్నారని మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు, స్కామ్‌లు చేసినవారు దేశాన్ని విడిచి విదేశాలకు పారిపోయారని, వారి వద్ద నుంచి నల్లధనం తీసుకువస్తానని ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా ఏం చేశారని నిలదీశారు. గాలి, వెలుతురు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు కమ్యునిజం ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో శ్రద్ధ వహించాలని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయాలని ఉద్భోదించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని మట్టి కరిపించాలంటే ఐక్యంగా ఉంటూ తమతో కలిసిరావాలని సూచించారు.
దాదాపు లక్ష మందితో నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తారు. ర్యాలీలు, ఊరేగింపులతో పట్టణం అరుణ వర్ణంగా మారింది. ఎక్కడ చూసిన ఫ్లెక్సీలు, కటౌట్లు, ఎర్ర జెండాలతో నిండిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కళాకారులు నిర్వహించిన నృత్య ప్రదర్శన అద్యాంతం సభికులను ఉర్రూతలూగించింది. మిమిక్రీ రమేష్ చేసిన ప్రదర్శన, పాటలు హైలెట్‌గా నిలిచాయి. ఈ కార్యక్రమంలో నేతలు మనీష్ కుంజా, సాబీర్‌పాషా, వాసిరెడ్డి సీతారామయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.