Monday, December 23, 2024

కదం తొక్కిన పదం

- Advertisement -
- Advertisement -

నవ తెలంగాణ వారి దాశరథి రంగాచార్య స్మారక నవలల పోటీ (2016)లో పెద్దింటి అశోక్ కుమార్ రాసిన “లాంగ్ మార్చ్‌”కు ప్రథమ బహుమతి వచ్చింది. 2019లో ఆ నవలను అన్వీక్షకి వాళ్ళు ప్రచురించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలి దశ ఉద్యమంలో మరలా పలు దశలున్నాయి. అందులో ఉద్యోగుల సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్‌లు ముఖ్యమైన ఘట్టాలు. ఈ రెండింటిని ఇతివృత్తంగా తీసుకొని పెద్దింటి తన నవలను రచించాడు.
సాహిత్యంలోని ఏ ప్రక్రియకైనా వస్తువెంత ముఖ్యమో, ఆ వస్తువుని తీర్చిదిద్దే భాష కూడా అంతే ప్రధానం. ముఖ్యంగా కాల్పనిక సాహితీ ప్రక్రియలైన కథా నవలాదులకు ఇది మరీ ముఖ్యం. పైగా, ఉద్యమ సాహిత్యానికి భాష ఇంకా ప్రధానం. తెలంగాణ ఉద్యమంలో సబ్బండ జాతులు, వర్ణాలు, ప్రజలు పాల్గొన్నారు. అది అహింసాయుతంగా సాగిన ప్రబల ఉద్యమం. ఆ ఉద్యమ నేపథ్యంగా వచ్చిన “లాంగ్ మార్చ్‌” నవలలో పెద్దింటి సాలోచనగానే తెలంగాణ సామెతలను, జాతీయాలను, తిట్లు దీవెనలను, ప్రాంతీయ ముద్రతో భాసిల్లే సంబోధనలను, పదాలు పద బంధాలను, మాట తీరును, పేర్లను చక్కగా ఉపయోగించుకున్నాడు. అందువల్ల ఆ నవల సహజ సంభాషణలతో చక్కగా కుదిరింది. భాషా దృష్టితో చూసినపుడు ఒక నేటివ్ ఫ్లేవర్‌ను పోగొట్టుకోకుండా నిలిచిపోయింది “లాంగ్ మార్చ్‌”.
నవలలోని కథా నాయకుని పేరు “రాయమల్లు”. నిజానికిది “రాజమల్లు” అనే పేరు. రాజమల్లులోని “జ” ప్రజల భాషలో “య”గా మారిపోతుంది. ఇది సహజ పరిణామమే! య, జ, ఈ రెండూ పరస్పరం మారుతాయి. ఉదా॥ యమున/ జమున, యాత్ర/ జాతర, యోగి/ జోగి, యశ్వంత్/ జశ్వంత్, జంతర్ మంతర్ / యంతర్ మంతర్, యోధుడు / జోదు, యవ్వనం/ జవ్వనం/ జుమ్ల, జమిలి/ యమళం, యామం/ జాము.. ఇలా ఎన్నెన్నో మార్పు కలిగిన పదాలు. అంతెందుకు? “మాది రాయల్ ఫ్యామిలీ” అని గొప్పలు చెప్పుకొంటున్న మాటల్లోని “రాయల్‌” ఏమిటి? “రాజుల” అని. ఆ “రాజుల ఫ్యామిలీ” యే “రాయల్ ఫ్యామిలీ” అయ్యింది. అల్లాగే “రాజమల్లు” ను పెద్దింటి “రాయమల్లు” అన్నాడు. “రాయల” పాలన తెలుసు కదా మనకు!
ఇప్పుడు … ఈ నవలలో అడుగడుగునా తారసపడే సామెతల పరిశీలిద్దాం. “ ఈ పాటి మెకానికి బీపేట్ల కొలువట.” “బీపేట” అనేది బీబీపేట. పెద్దింటి పుట్టి పెరిగిన మల్లారెడ్డి పేటకు దగ్గరి ఊరు. ఈ సామెతను వ్యంగ్య వైభవ పురస్సరంగా సంభాషణల్లో వాడుతుంటారు. చేసే పనిని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలి వెళ్ళే శాల్తీలను చూసి “నడిమడ్లె నాగలిడిసినట్లు” అనే సామెత వాడుతారు. అర్థాంతరంగా పని వదిలేయడం సరికాదు కదా! ఈ సామెతకు వ్యవసాయం నేపథ్యం, పల్లె జనాల ప్రధాన వృత్తి సేద్యం కనుక పల్లీయుల అనుభవం నేపథ్యంగా వస్తాయి ఈ సామెతలు. వీటిని చాలా చక్కగా నవలలో సందర్భ శుద్ధితో జొప్పించిన వినియోగదారుడు రచయిత. “ఉరుకులాట ఉత్తచాట”… మరో సామెత. తొందరపడే స్వభావం కలవాళ్ళని ఉద్దేశించి చెప్పే నానుడిది. పైగా త్వరపడి సైతం నిష్ప్రయోజకులైన మనుషుల గురించి చెబుతున్నది.
ఉద్యమంలో భాగంగా “గొల్లపల్లి” అనే ఊరికి చుట్టు పక్కల గ్రామాల జనమంతా వచ్చేశారు. ఆ సన్నివేశాన్ని పెద్దింటి “పుట్ట బెదిరినట్టే వుంది ఊరు” అన్నారు. పుట్టలోపలి చీమలు అన్నీ బయటికొచ్చినట్లు అనేక గ్రామాల జనం ఓ చోట గుమిగూడారని చెప్పడం.
అప్పటి ప్రభుత్వం ఉద్యమాన్ని ఎన్ని రకాలుగా అణచివేయాలో అన్ని రకాలుగానూ అణచివేసింది. అమాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. రచయిత ఓ పాత్ర నోట అందుకే పలికించాడు.
“సర్కారుకు సాలా మూలా?” అనే సామెత. దీనికి “పద్ధతా పాడా?” అని అర్థం. “సాలు” అంటే ఒక పద్ధతే సంప్రదాయం. “మూల” అన్నది “సాలు” అనే దానికి సాయంగా వచ్చిన పదమా అనేది ఆలోచించాలి.
“కూట్లె రాయి తియ్యనోడు ఏట్లె రాయి తీసినట్టు” అనే సామెత, “ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట” వంటిదే! “కాల్లు కడుపలు దాటయి గని మాటలు కోటలు దాటుతయి” లాంటిదే! తను తినే కంచంలోని కూటిరాయిని తీయలేని వ్యక్తి దూరంగా ఏటిరాయిని తీయగలడా?
పెద్దింటి అశోక్ కుమార్ పల్లెలో పుట్టి పల్లెలో పెరిగి ఆ చుట్టు పక్కల ప్రజల బతుకుల్ని, వాళ్ళ మాటల్ని బాగా ఎరిగినవాడు. ఓ చోట “దున్నంగవోయి దులుపంగ వచ్చిండు” అన్నాడు. ఇదీ వ్యవసాయ నేపథ్యం నుండి పురుడువోసుకున్న లోకోక్తి.
“ఎండ పొద్దును మబ్బులు ఎంతసేపు కప్పుతయి?” అనే వాక్యం వుంది నవలలో. ఇదీ ప్రజల మాట తీరే అయి వుంటుంది. జానపదుల దగ్గర నేర్చుకోవలసిన జ్ఞానం అపారం. “ఉదయించే సూర్యుణ్ణి ఎవరాపగల్గుతారు? వంటి వాక్యానికి పై సామెత వంటి వాక్యం చాలా దగ్గరగా వుంది.
“మంచమున్నప్పుడే నొప్పులు రావాలన్నట్లు”… అనేది ఇంకో సామెత. నొప్పి కల్గినపుడు మంచం అవసరం కానీ, మంచాన్ని చూసి నొప్పి కలగాలనుకోవటం అజ్ఞానమే కాకుండా స్వార్థపరత్వం. ఉద్యమం ఉన్నప్పుడు మనం పాల్గొనాలి కాని, మనకు తీరినపుడు ఉద్యమ భాగస్వామి కావాలనుకోవటం అలాంటిదే!
ఇండ్లల్లో టివిలు “కుక్కలు సోకాలు పెడుతున్నట్లు” మోగుతున్నాయి అంటాడు పెద్దింటి. టివిని రాత్రనకా పగలనకా చూసే జనాల పట్ల ఒక విసురు. ఒక విసుగు. ఇంకో చోట “గట్టుకు మొరిగిన కుక్క గూత ఎల్లక సచ్చిందట’ అనే సామెత వుంది. పల్లె ప్రజల పరిశీలన ఎంత గొప్పది!
పల్లె ప్రజల మధ్య వున్న రచయిత ఎంత గొప్పవాడు!! మనకు సాధారణంగా తెలిసినది ‘అరణ్యరోదనం”. ఈ ఏడుపు నిష్ప్రయోజనం. ఎవడూ వినడు. వినటానికి అరణ్యంలో ఎవడుంటాడు? ఈ “అరణ్యరోదనానికి” సమానార్థకంగా వచ్చిందే పల్లె ప్రజల సామెత. “గట్టు” అంటే “కొండ”. అడవుల్లో గుట్టలుంటాయి. తప్పిపోయిన కుక్క గట్టున మొరిగితే లాభం లేకపోగా దాని గొంతుపోయి కూత వెళ్ళక చనిపోయిందట! పాపం!!
“ఏనుగు ఎత్త మరిగితే దోమ దొబ్బ మరిగిందట” అనే సామెత పేనుకు పెత్తనం ఇస్తే నెత్తి అంతా కొరిగిందట”కు దగ్గర, అంటే, అలుసు ఇస్తే చాలు మన గురించి తెలుసుకొని “లాగం దొబ్బుతరు”. ఏనుగెక్కడ? దోమ ఎక్కడ? హస్తిమశకాంతరం. దోమను పాపం పోనీ అని ఏనుగు ఎత్తుకోవడం ఆరంభిస్తే, అది కాస్తా దీన్నే దొబ్బుతున్నది, నెట్టుతున్నది. మూలమూలలా దాగిన ఇటువంటి దాచేస్తే దాగని సామెతల్ని “లాంగ్ మార్చ్‌”లో కవాతు చేయిస్తాడు రచయిత.
ఓ చోట “ముడ్డి కిందికి నీల్లు వచ్చినా సోయి లేదు” అంటాడు పెద్దింటి. ఇది సామెతో, జాతీయమో, ఓ ప్రత్యేకమైన మాటతీరో… ఏదైతేనేం… “కాళ్ళ కింద నేల కదిలినా స్పృహ లేదు” వంటి వాక్యానికి దగ్గర, కాళ్ళ కింది నేల కదలడం భూకంప సూచన. ముడ్డి కిందికి నీళ్ళు రావటం వరదో, వెల్లువో, ఉప్పెనో ముంచెత్తగా కల్గిన నీటి దారుణ షేచన.
“ఒక్క ఉద్యోగులు చేత్తెనే ప్రభుత్వం భయపడతదా… గంజిల ఈగెను తీసేసినట్టు తీసేత్తది”. ఇందులో “గంజిల ఈగెను తీసేసినట్టు” అనేది ఏదీ లెక్క చేయని, లక్షపెట్టని, గౌరవించని మాట తీరు. ఇదీ గ్రామీణుల అనుభవం లోంచి ఆవిర్భవించిందే! వాళ్ళు కలో గంజో తాగుతారు కదా!
“ఏ ఊకో రాయమల్లూ. ఎందరు ఏమో అంటరు. అన్ని పట్టుకుంటరా. గంట ఎగిరిందని ఎద్దు ఎగురుతదా?” రాయమల్లును సముదాయిస్తూ దశరథం అన్నాడు. ప్రాణమున్న ఎద్దు మెడలో కట్టిన గంటలను ఎవరైనా కదిపితే అది కదలవచ్చు ఎగరావచ్చు. కాని తదనుగుణంగా ఎద్దు ఎగరకూడదు. ఈ సామెతకు ఇంకో అర్థం కూడా ఉందేమో! శివాలయాల్లో నంది ఉంటుంది. అలాగే భక్తులు వాయించడానికి గంటా వుంటుంది. అది గణ గణమని మోగినపుడల్లా నంది కదిలితే ఎలా? “నవ్వెటోల్ల ముందర జారిపడ్డట్లు” ఇదీ సామెతే! ముందే కొందరు ఓ మనిషిని చూసి ఎప్పుడూ హాస్యమాడతారు, అపహాస్యం చేస్తారు, వాడికి అలా కావలసిందేనని హాయిగా నవ్వుకుంటారు. వాడి ప్రతి కదలిక, వీళ్ళ ముఖ కవళికను నవ్వులాటగా మార్చుతుంది. అటువంటిది… వాళ్ళ ముందరి నుండి సాగిపోతూ జారిపడితే ఆ జనం మరీ దారుణంగా నవ్వరూ!
ఓ సందర్భంలో రాయమల్లును ఉద్దేశించి భార్య “అవును నేను చెప్పినట్టే నడువవడితివి. దొంగది గాదు ఇంటికి రాదు” అంది. ఏమిటది? ఎద్దు లేదా బర్రె. మొత్తానికి ఆవో, పోతో… ఇంటి పశువు. అది దొంగది కాదుట! ఇంటికి రాదుట!!… ఎంత వెక్కిరింతో మరి. దొంగది కానపుడు సాక్కగ ఇంటికి రావాలి కదా! రాదు. అంటే దొంగదే అన్నట్టు.
“తాకుడు కాల్లోనికి తంకం చెప్పులన్నట్లు” సామెత! మొదలే ఆ మనిషఙ తాకుడు కాళ్ళవాడు. నడుస్తుంటే జన్మతః వచ్చిన వంకర కాళ్ళతో అలా వెళతాడో, తొడలు లావుగా వుండి కాళ్ళు తాకుతూ కదులుతాడో తెలీదు. పైగా వాడికి “టంకం’ బరువున్న చెప్పులు. నడక మరీ కష్టం. “టంకం” అంటే వంద గ్రాముల బరువు ఒక అర్థం. తమిళం లో “తంగం” అంటే బంగారం. మరి ఆ అర్థమా? ఇంకా “టంకశాల”లో వున్న డబ్బుల అర్థం గల టంకమా? ఇప్పటికీ బెంగాలీలో, ‘టాకా’ అంటారు డబ్బుల్ని. బంగ్లాదేశ్ ఢాకా సైతం ఈ ‘టాకా’ యే!
“చాట్ల తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెడుతున్నట్లు” మరొటి.
“నాలె సూపులత్త పాణాల గుత్త” ఇదీ సామెతే! ఇది ఎంత గొప్ప పల్లెతనం కోల్పోని శాస్త్రం! అత్తగారి వన్నీ నేల చూపులే! ఏమీ ఎరగని, ఏలు పెడితే చీకలేని, ఎన్న పెడితే నాకలేని అమాయకురాలే! అలా అని మనం నమ్మామా, ఆమె మన ప్రాణాలు తోడేయటం ఖాయం.
ఇంకో సన్నివేశంలో “చెరువుల పిసికిన చింత పడేనా?” అంటాడు రాయమల్లు దశరథంతో. మన ఉద్యమం అలా నిస్సారమవుతుందా అని అతని ఆవేదన. గ్రామీణ సామెతలు ఎంత ప్రతిభావంతంగా, శక్తిమంతంగా, అనుభవం పునాదిగా ఉంటాయో పై నానుడి చెబుతున్నది. “పిట్ట బెదిరిచ్చి బట్ట పేగు ఎత్తుక పోయిందట”లో కూడా “తాటాకు చప్పళ్ళకు కుందేళ్ళు బెదరవన్న” స్ఫురణ వుంది.
“నాలుక సందుల ముల్లు ఇరిగినట్టు” అనే సామెత “ధర్మ సంకట పరిస్థితి”కి నిదర్శనం. ఇది చాలా సున్నిత విషయం. ఆ అంశమే కాక, నాలుకా సుకుమారమే! మరి అక్కడ ముల్లు విరిగితే ఎంత కష్టం! పైగా, ఏం ముల్లు? చేప ముల్లే అయి వుండాలి. ఎవరో శాకాహారి దొంగ దొంగతనంగా జల పుష్పం తింటూ అలవాటు లేక ముల్లు గుచ్చుకుంటే ఎవరితో చెప్పుకోగలడు.
“గడ్డి గాడ్పున పోతేంది వడ్లు వాగున పోతేంది?” గొప్ప అభివ్యక్తి, అద్భుత లోకోక్తి. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని చెప్పే ఉక్తి. “పద్మ పత్ర ఇవ అంభసే” అనే సూక్తి. దున్నపోతు మీద వాన పడ్డ విధాన మన్న మాటతీరు. “రోమ్ నగరం తగలబడుతున్నా నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్న” పట్టనితనం.
“పిరికి పంద రోజూ మరణిస్తాడు. వీరుడు ఒక్కసారే మరణిస్తాడు”కు సమానార్థకంగా విరివిగా తెలంగాణలో వాడే సామెత “పుట్టిందోనాడు సచ్చిందోనాడు”. మాటిమాటికీ రోజురోజుకీ నానాట చావటం సరైంది కాదనే మాట ఇది.
“సూదిని ఎవడు ముల్లె గట్టలేడు” అనే వాక్యం “సూదిని ముల్లె గట్టినట్లు” అనే సామెత నుండి పుట్టింది. ఔను ఉద్యమకారుడు సూది వంటివాడు. అతణ్ణి ఎంతగా భయపెట్టినా, నిర్బంధాల పాలు చేసినా, చిత్రవధలకు గురి చేసినా ఆయన వణ్కడుజెణ్కడు. అది అచ్చంగా పదునుదేరిన, వాదన కలిగిన నిశాతమైన సూదిని ఓ గుడ్డలో వేసి మూట కట్టాలనుకునే మూర్ఖ ప్రయత్నం. వ్యర్థ ప్రయత్నం. ఎంత మూట గట్టాలని పూనుకుంటే అంతగా సూది ఆ గుడ్డలోంచి బయటకు చొచ్చుకొచ్చే పూనకానికి లోనవుతుంది.
“సూడుండ్రోయ్ సుతారం నేను పోతున్న పోతారం” పెద్దింటి నమోదు చేసిన మరో సామెత. “అదృష్టం అందలం ఎక్కుదామంటే బుద్ధి గాడిదలు కాసిందట” వంటి సామెత “నోరు అందులమెక్కుదామంటే నొసలు కట్టెలు మోద్దామన్నదట”కు సమానం.
“లాంగ్ మార్చ్‌”లో ఇటువంటి పల్లె ప్రజల సామెతలు భుజం భుజం కల్పుతూ కదం తొక్కాయి. పైగా “కుక్కమొకపోడు, గుంబగాడు, గడ్డిగాడు, తండ్రిగాడు (అత్యంత గౌరవభావంలో)” మొదలైన పదాలున్నాయి. “పత్తలేడు జాడ లేడు”, మాట లేదు పలుకు లేదు”, “మౌనం సిగ్గు లేదు” వంటి అనేక జంట పదాలున్నాయి. “మనసంతా తొక్కులాడుతుంది” వంటి తొక్కులాట, తండ్లాట, పాతులాట, పతుకులాట, దేవులాట వుంది. ఈ “తండ్లాట” ఒక వెంపర్లాట వంటిది. ఈ “పాతులాట” ఇంకొక ప్రాకులాట వంటిదే!
“ఆకలితో కడుపు నకనకలాడుతుంది”కి తీసిపోని “కడుపుల సురసుర” వుంది. నిజానికి శిష్ట భాషలోనిది “నక నక” కాదు “కన కన”. ఆకలి మంటతో కడుపు కణ కణ మండుతుంది. “ఆ మర్రి”, ఈ మర్రి”ని గబ గబా త్వరత్వరగా పల్కితే “రామ రీమ” అయినట్లే, “కణ కణ” “కన కన”గా మారింది. ఆ “కణ కణే” తెలంగాణ “సుర సుర”, “కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి” అనే మాట తీరే పెద్దింటి రచనలో “కడుపుల గోకుతున్నది’ అయింది. ఇంకా “కడుపుల కాలుతున్నది” గా మారింది. శిష్ట భాష లోని “మంచి శాస్తి జరిగింది” అనే దానికి బదులుగా లాంగ్ మార్చ్‌”లో “తిక్క కుదిరింది రోగం తిరిగింది కావురం వంగింది” గా వుంది. ఓ రకంగా “కావురం వంగడం” అనేది గర్వభంగం కావడం వంటిది. గర్వభంగం తెచ్చి పెట్టుకున్నది. కావురం వంగడం సహజమైనది.
ఓ చోట పెద్దింటి “ఇంతింత పొద్దెక్కుతుంది” అంటాడు. ఈ “ఇంతింత” అనేదే పోతన పద్యంలోని “ఇంతింతై వటుడింతై” అనేది. శిష్ట భాషకు ప్రజల విశిష్ట భాషే మూలధాతువు. పోతన, తిక్కన, నన్నయ వంటి మహా కవులు రెండు భాషల్నీ బాగా ఎరిగిన వారు. అందుకే నన్నయ ఘన దురితానుబంధ కలికాలజ దోష తుషార సంహతిన్ తన యుదయ ప్రభావంబున దవ్వుగ జోపి” అన్నాడు. ఆ “జోపి”.. నిజానికి “చోపి”. అదిప్పటికీ తెలంగాణలో “ఈగల్ని జోపు”లో వుంది. తిక్కన ఓ చోట “చాలు మాసి” అన్నాడు. అది ఈనాటి తెలంగాణలోని “చాలు బాజి” ఒక్క “త్రాసు” మాత్రమే కాదు, తిక్కన వాడిన ఈ “చాలు మాసి” సైతం అన్యదేశ్యమే!
పెద్దింటి నవలలో ఓ సందర్భాన “ఉడుకు రక్తం మీదున్న వాళ్ళు” అన్నాడు. అదీ ప్రజలదే! శ్రీశ్రీ “రక్తం మండిన శక్తులు నిండిన వాళ్ళ”కు సన్నిహితంగా లేదా ఇది?
ప్రజల ఉద్యమాలను, ప్రజల బ్రతుకులను ప్రజల భాషలో ప్రాంతీయ భాషలో చిత్రించిన రచన కలకాలం వుంటుంది. అది “కన్యాశుల్కం” కావచ్చు, “మాలపల్లి” కావచ్చు. “చిల్లర దేవుళ్ళు ” కావచ్చు. “ప్రజల మనిషి” కావచ్చు. ఇంకా ఇలాంటివి ఏవైనా కావచ్చు. పెద్దింటి “లాంగ్ మార్చ్‌” ఆ దారితోనే నడిచిన నవల.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News