అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌ని పదవి నుంచి దించేసి శతజయంతి ఉత్సవాలు చేస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్ముతారని కొడాలి నాని ప్రశ్నించారు. భారత రత్న ఇచ్చేంత గొప్ప వ్యక్తి ఎన్‌టిఆర్ సిఎం పదవికి పనికిరాడా? అని ఎందుకు దించేశారని అడిగారు. చంద్రబాబు నాయుడుకు దూరంగా ఉండమని జూనియర్ ఎన్‌టిఆర్‌కు హరికృష్ణ చెప్పి ఉండొచ్చన్నారు. సోమవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. హరికృష్ణని, ఎన్‌టిఆర్ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని, అమిత్ షా కాళ్లు బాబు పట్టుకున్నారని కానీ ఫొటోను బయటపెట్టలేదని విమర్శలు గుప్పించారు.
బిజెపిని, మోడీ, అమిత్ షాను తిట్టి సిగ్గులేకుండా చంద్రబాబు వాళ్ల కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. టిడిపి నేత లోకేష్‌పై కోడిగుండ్లు వెయ్యాల్సిన అవసరం తమకు లేదన్నారు. లోకేష్ కంటే తమ పార్టీలో ఎవరు పాదయాత్ర చేసినా అంతకంటే ఎక్కువ జనం వస్తారని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు అమరావతిని బినామీల రాజధానిగా మార్చాలనుకున్నారని, రెండు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి కాదని, చంద్రబాబుకు ఆదాయంగా వచ్చేదన్నారు. చంద్రబాబు అధికారంలో లేకపోతే హెరిటేజ్, ఈనాడు, మార్గదర్శి, ఆంధ్రజ్యోతి, టివి5కి నష్టాలు వస్తాయని, వాళ్ల వ్యాపారాలు, అవినీతి కోసమే చంద్రబాబుకు అధికారం కావాలంటున్నారని నాని దుయ్యబట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు రోడెక్కితో ఏం అవుతుందని, ఇంతకు ముందు ఎక్కలేదా? అని అడిగారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని చురకలంటించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసినా జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని, గుడివాడలో పేదల కలను నిజం చేస్తున్నామని కొడాలి నాని తెలిపారు.