ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌కు బిసి నేతల వినతి
హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి సహా అన్ని రాజకీయ పార్టీలు బిసిలకు 50 శాతం టికెట్లు కేటాయించాలని బిసి నేతలు డిమాండ్ చేశారు. జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బిసి బృందం సోమవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్ కుమార్‌ను మినిస్టర్ క్వార్టర్స్‌లో కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. పార్లమెంటులో బిసి బిల్లు పెట్టి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, బిసిలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని ఈ సందర్భంగా కృష్ణయ్య కోరారు.
త్వరలో జరగబోయే జనాభా గణనలో కులాల వారి లెక్కలు తీయాలని, బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలన్నారు. బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని, పారిశ్రామిక పాలసీలో బిసిలకు 50 శాతం కోటా ఇవ్వాలని, కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి రూ. 2 లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకం ప్రకటించాలని కోరారు. హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి లకు రిజర్వేషన్లు ప్రవేశ పెట్టాలని, రూ, 2 లక్షల కోట్లతో బిసి సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వినోద్ కుమార్‌ను కలిసిన వారిలో జాతీయ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, బిసి వెల్ఫేర్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎన్. భూపేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.