Monday, December 23, 2024

సాదా బైనామా దరఖాస్తులకు త్వరలో మోక్షం ?

- Advertisement -
- Advertisement -
8.90 లక్షల మంది దరఖాస్తుదారులు….20 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని
క్రమబద్ధీకరించే అవకాశం
పక్కాగా దరఖాస్తుదారులు, భూముల సమాచారం సేకరణ
గత అనుభవాల నేపథ్యంలో పారదర్శకంగా దరఖాస్తుదారులకు
న్యాయం చేయాలని ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్: తెల్ల కాగితాలపై ఒప్పందం ఆధారంగా జరిగిన భూ విక్రయాలకు (సాదాబైనామా) దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది. మూడేళ్ల క్రితం ప్రభుత్వం సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియకు అవకాశం కల్పించినప్పటికీ మధ్యలోనే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే 8.90 లక్షల మంది దరఖాస్తుదారులకు త్వరలోనే ఊరట లభించనుంది. సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకున్న రైతుల భూములు సాగులో ఉన్నప్పటికీ వాటిని క్రమబద్ధీకరించక పోవడంతో వారు ఆ భూములను విక్రయించలేక గత కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు.

2014 జూన్ రెండో తేదీకి ముందు సాదాబై నామా పద్ధతిలో జరిగిన కొనుగోళ్లను అధికారికంగా గుర్తించేందుకు 2016లో క్రమబద్ధీకరణ ప్రక్రియను మొదటగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ సమయంలో 11.19 లక్షల దరఖాస్తులు రాగా 6.18 లక్షల మంది భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. అనంతరం మరోమారు అవకాశం ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు ఇవ్వడంతో రెండోదఫా ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో అవకాశం కల్పించింది.

2016 సంవత్సరంలో 11.19 లక్షల దరఖాస్తులు

2016లో ప్రభుత్వం మొదటగా ప్రకటించిన సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 11.19 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో నిబంధనల మేరకు ఉన్న 6.18 లక్షల దరఖాస్తులకు సంబంధించి 2 లక్షల ఎకరాలకు పైగా భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనల ప్రకారం లేని 4.19 లక్షల దరఖాస్తులను తిరస్కరించింది. తాజాగా 2020 అక్టోబర్ 12వ తేదీన చివరివిడతగా క్రమబద్దీకరణ పథకాన్ని మళ్లీ ప్రభుత్వం ప్రకటించింది. అదే నెల 29వ తేదీని చివరి గడువుగా పేర్కొన్నప్పటికీ ఆ తరువాత నవంబర్ 10వ తేదీ వరకు పొడిగింపునిచ్చింది. సాదా బైనామాలకు ఆర్‌ఓఆర్ చట్టం 197 ప్రకారం రూల్ 1989లోని రూల్ 22 ప్రకారం ఫారం 10లో దరఖాస్తు చేసుకున్న వారికి 13 బి ధ్రువీకరణ పత్రంతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఆ చట్టంలో సూచించింది.

నవంబర్ 10వ తేదీ నాటికి దాదాపు 2.26 లక్షల దరఖాస్తులు

కొత్త చట్టంలో సాదాబైనామాలకు అవకాశం లేకపోవడంతో నూతనంగా మార్గదర్శకాలను జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. 2020 అక్టోబర్ 29 నాటికి దాదాపు 2.26 లక్షల దరఖాస్తులు క్రమబద్ధీకరణ కోసం వచ్చాయని అధికారులు పేర్కొన్నా, నవంబర్ 10వ తేదీ వరకు ప్రభుత్వం పెంచిన గడువుతో మరో 6.74 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. అయితే 2016 సంవత్సరంలో సాదాబైనామాల దరఖాస్తుల విషయంలో కొందరు అధికారులు లంచాలు తీసుకొని వేరే వారికి మేలు చేశారని సిఎం కెసిఆర్ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈసారి అలా కాకుండా జాగ్రత్తగా దరఖాస్తులను పరిశీలించడంతో పాటు అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించినట్టుగా సమాచారం. దీంతోపాటు వారసత్వ హక్కుల ప్రకారం యాజమాన్య హక్కుల పేరు మార్పిడి (ఫౌతీ) అమలు చేసే విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సిఎం అధికారులను ఆదేశించినట్టుగా తెలిసింది.

ఆర్‌ఓఆర్ రద్దుతో..
దరఖాస్తులు వచ్చేనాటికి భూ దస్త్రాల యాజమాన్య హక్కుల చట్టం (ఆర్‌ఓఆర్) రద్దయ్యింది. సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియ విధి, విధానాలన్నీ ఈ చట్టం కిందే ఉన్నాయి.
2020 అక్టోబర్ 23వ తేదీ నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది. ఇందులో సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణకు ఎలాంటి విధి, విధానాలను ప్రభుత్వం సూచించలేదు. దీనిపై కొందరు హైకోర్టులో కేసు వేయడంతో పాత ఆర్‌ఓఆర్ చట్టం ప్రకారం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది.దరఖాస్తులను క్రమబద్ధీకరించడానికి కొత్త చట్టాన్ని సవరించాల్సి వచ్చింది. రెండేళ్ల క్రితమే ఆర్డినెన్సు తీసుకురావాలని ప్రభుత్వం భావించినా కొన్ని కారణాల వలన అది ముందుకు సాగలేదు.
క్రమబద్ధీకరణలో భాగంగా ఆర్హులను తేల్చాలని గతేడాది భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఏ) జిల్లా కలెక్టర్‌ల లాగిన్‌లకు ఈ దరఖాస్తులను పంపించగా అందులో సుమారుగా 3 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈనేపథ్యంలోనే ఈసారి పక్కాగా దరఖాస్తులను పరిశీలించి వాటిని ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ధరణి పోర్టల్లో ఉన్న భూ సమాచారం ఆధారంగా విక్రయాలకు అవకాశం ఉన్నందువల్ల చాలాచోట్ల రికార్డులు చేతులు మారాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో దీనిపై రెవెన్యూ అధికారులు సమాచారం సేకరించారు. రెండోదఫా సాదాబైనామా దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించగా రెండో విడతలో మొత్తంగా 8.90 లక్షల దరఖాస్తులు రాగా సుమారుగా 20 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News