న్యూస్ డెస్క్: ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ జనసేన అధినేత, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో సోమవారం పవన్ కళ్యాణ్‌ను కలుసుకున్న బివిఎస్‌ఎన్ ప్రసాద్ అనంతరం ఆ పార్టీలో చేరారు. జనసేన పార్టీ కండువాను కప్పి ప్రసాద్‌ను పార్టీలోకి పవన్ ఆహ్వానించారు. బివిఎస్‌ఎన్ ప్రసాద్ తెలుగులో అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మాణంలో ఛత్రపతి, మగధీర, డార్లింగ్, నాన్నకు ప్రేమతో, తొలి ప్రేమ, ఇటీవల విడుదలైన విరూపాక్ష తదితర చిత్రాలు రూపొందాయి.
గతంలో బివిఎస్‌ఎన్ నిర్మించిన అత్తారింటిది దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించారు. అయితే..పవన్‌కు చెల్లించాల్సిన పారితోషికం విషయంలో వారిద్దరి మధ్య విభేదాలు పొడసూపినట్లు సమాచారం. తనకు రావలసిన రూ 2 కోట్ల పారితోషికం బకాయిల కోసం పవన్ కళ్యాణ్ 2016లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)కు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఆ తర్వాత ఈ వివాదం పరిష్కారమైంది. కాగా&జనసేన పార్టీలో చేరిన బివిఎస్‌ఎన్ ప్రసాద్ క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదో వేచి చూడాలి.
ఇలా ఉండగా..వారాహి రథంలో పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల ప్రచార యాత్ర చేపట్టనున్నారు. యాత్రకు ముందు ఆయన సోమవారం యాగం నిర్వహించారు.