న్యూస్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ ట్రక్కులో ప్రయాణించారు. అయితే ఈసారి భారత్‌లో కాకుండా అమెరికాలో ఈ ప్రయాణం చేయడం విశేషం. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు ట్రక్కులో ప్రయాణించిన రాహుల్ అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ట్రక్కు డ్రైవర్ల దైనందిన జీవితాల గురంచి వారితో ముచ్చటించారు.
ట్రక్కు డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు కొద్ది రోజుల క్రితం ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు ట్రక్కులో ప్రయాణించిన రాహుల్ ఈసారి అమెరికాలో నివసించే ట్రక్కు డ్రైవర్ల మంచిచెడ్డలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు 190 కిలోమీటర్ల అమెరికన్ ట్రక్కు యాత్ర చేసిన రాహుల్ ట్రక్కు డ్రైవర్ తల్జీందర్‌సింగ్ విక్కీ గిల్‌తోపాటు అతని సహాయకుడు రంజీత్ సింగ్ బనిపాల్‌తో ముచ్చటించారు. ఒక హోటల్‌లో అల్పాహారం తీసుకుని రాహుల్ తన అమెరికన్ ట్రక్కు యాత్రను ముగించారు.
అమెరికాలో ట్రక్కులు డ్రైవర్ భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేస్తారని, కాని భారత్‌లో పరిస్థితి అది కాదని రాహుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అమెరికాలో నివసించే భారత సంతతికి చెందిన ట్రక్కు డ్రైవర్ల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికే తాను ఈ ప్రయాణం చేసినట్లు రాహుల్ తెలిపారు.