- మెదక్ కలెక్టర్ రాజర్షి షా
మెదక్: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో వైద్యారోగ్య దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం తెలిపారు. మెదక్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక మాయ గార్డెన్ నందు ఉదయం 10 గంటలకు, నర్సాపూర్ నియోజకవర్గానికి సంబందించి నర్సాపూర్‌లోని సాయికృష్ణ గార్డెన్స్ నందు ఉదయం 10 గంటలకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య రంగంలో సాధించిన ప్రగతితోపాటు కంటి వెలుగు, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు తదితర కార్యక్రమాలపై వివరిస్తారని అన్నారు.
ప్రభుత్వాసుపత్రులందు పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. గర్భిణీ మహిళలకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అందించే నూతన కార్యక్రమానికి శ్రీకారం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు స్టాప్ నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్లు, డాక్టర్లను సన్మానించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కావున ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.