Monday, December 23, 2024

మహిళలకు అందుతున్న సంక్షేమ పథకాలతో మహిళలు సంతోషంగా ఉన్నారు..

- Advertisement -
- Advertisement -

నల్గొండ : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన మహిళలు సంతోషంగా జీవిస్తున్నారని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో లక్ష్మీ గార్డెన్లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహిళా,శిశు, వయో వృద్ధుల,దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో నల్గొండ నియోజక వర్గంలో ‘మహిళా సంక్షేమ దినోత్సవం’ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల చేతిలో మన ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడిందని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన రాష్ట్రం బాగుంటుందని భావించిన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి,నాటి ఉద్యమ నాయకుడు కెసిఆర్ సారథ్యంలో ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నాం అని తెలిపారు. సాధించుకున్న తెలంగాణలో మహిళలు గౌరవించబడేలా వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నాణ్యమైన సేవలు అందిస్తున్నాం అని ఆయన తెలిపారు. గతంలో ఆడపిల్లలు పుడితే పురిట్లోనే చంపేవారని, ఆడపిల్ల ఇంటికి భారం అవుతుందని పెంచి పెద్ద చేసి కట్న కానుకలు ఇచ్చి పెళ్లిళ్లు చేయవలసి వస్తుందనే ఉద్దేశ్యంతో పురిట్లోనే చంపే వారన్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఆడపిల్ల మహాలక్ష్మి అని భావించి పెండ్లికి భారం కాకుండా పేద కుటుంబాలకు చెందిన పెండ్లిడుకు వచ్చిన వారందరికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. మహిళలు ప్రవేటు ఆసుపత్రులకు పోయి డబ్బులు వృధా చేసుకోకుండా అన్ని రకాల వైద్య పరీక్షలను ఉచితంగా ప్రభుత్వ వైద్యశాలలోనే చేస్తున్నామని ఆ సౌకర్యాన్ని వినియోగించుకొని మహిళలు ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నారని ఆయన అన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇచ్చాము.

స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. బి.సి. రుణాల కింద ఒక లక్ష రూపాయలు కూడా మహిళల పేరు మీదనే ఇవ్వ నున్నట్లు తెలిపారు. ఎందుకంటే మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుందని, అన్ని కుటుంబాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. గతంలో పెన్షన్ 200 లు ఉంటే మన ప్రభుత్వం వచ్చినాక వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు 2016 ఇస్తున్నామని, అదేవిధంగా వికలాంగులకు 3016 రూపాయలు ఉంటే ఇటీవలనే 4016 రూ.లకు ప్రభుత్వం పెంచుతున్నట్లు ప్రకటించిందని ఆయన అన్నారు.

మనమంతా వ్యవసాయ ఆధారిత అనుబంధ కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. మనం వ్యవసాయం చేయాలంటే కరెంటు, నీళ్లు కావాలి అది గ్రహించిన కేసీఆర్ ఉచిత విద్యుత్తు అందించి ఆదుకున్నారన్నారు. అదనంగా పంట పెట్టుబడి సాయం అందజేసి పంటలు ఎక్కువ పండించేలా ప్రోత్సహించారని ఆయన తెలిపారు. ప్రతి కుటుంబంలోని సోదర సోదరీమణులు సంక్షేమ ఫలాలు పొంది ఆనందంగా ఉండాలని ఆయన కోరారు. మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు.. వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు మెమొంటో శాలువాతో ఘనంగా సత్కరించారు.. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మహిళా, శిశు,వయో వృద్ధుల,దివ్యాం గుల శాఖ అధికారిణి కృష్ణవేణి,ఉద్యాన శాఖ అధికారిణి సంగీత లక్ష్మి, ఎంపీపీలు విజయలక్ష్మి, సుమన్, కరీం పాషా, జడ్పిటిసి ఉంగూరి లక్ష్మయ్య, కౌన్సిలర్లు యమా కవిత, ఎడ్ల శ్రీను, పూజిత శ్రీనివాసు, సర్పంచులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News