హైదరాబాద్: దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్న తెలంగాణ అమరవీరుల స్మృతివనం కార్యక్రమ నిర్వహణ, భద్రత ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం సమీక్షించారు. పోలీస్, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి స్మృతివనం వద్ద ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలో పోలీస్ భద్రత, ట్రాఫిక్ నిర్వహణ తదితర ఏర్పాట్లు సజావుగా జరగాలని, ట్రాఫిక్ నియంత్రణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నగర అదనపు పోలీసు కమిషనర్లు విక్రమ్‌సింగ్ మాన్, సుధీర్‌బాబులకు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు.
అమరవీరుల స్మృతివనం వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను కూడా సిఎస్ పరిశీలించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ గణపతి రెడ్డిని ఆదేశించారు. జీఏడి కార్యదర్శి శేషాద్రి, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, వాటర్ వర్క్ ఎండి దానకిషోర్, జీహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్‌కుమార్, ఫ్రొటోకాల్ డైరెక్టర్ అరవిందర్ సింగ్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.