ఖమ్మం : మహిళలకు అన్ని రంగాల్లో ప్రభుత్వం ఆదుకొని చేయూత నిస్తుందని, సమాజం వారికి సమాన అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. అంగన్వాడీ వర్కర్ల ను అంగన్వాడీ టీచర్లుగా పిలవడంతో వారి గౌరవం పెరిగిందన్నారు.
అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలు 300 శాతం పెరిగినట్లు ఆయన తెలిపారు. నగర కార్పొరేషన్‌లో 36 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నట్లు, ఇది 50 శాతానికి మించి ఉందని ఆయన తెలిపారు. నిర్ణయాత్మక పదవుల్లో మహిళలు ఉండాలని, మహిళలు సమస్యలు, బాధలు త్వరగా అర్థం చేసుకుంటారని ఆయన తెలిపారు. ఐఏఎస్ లలో టాప్ 3 స్థానాల్లో మహిళలే ఉన్నారని, సామాజిక చేయూత అందిస్తే 33 శాతం కాకుండా 50 నుండి 60 శాతం మహిళలే ఉంటారన్నారు. 70 వేల మందికి వితంతు, ఒంటరి మహిళ లకు ఆసరా పెన్షన్లు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కళ్యాణలక్ష్మి క్రింద 45 వేల కుటుంబాలకు లబ్ది చేకూర్చినట్లు ఆయన అన్నారు. ఈ పథకంతో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 45 గురుకులాల్లో 19113 మంది బాలికలు చదువుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అందిస్తూ అనీమియా నివారణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకం అమలుచేస్తుందన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పాలు, గుడ్డుతో పౌష్టికాహారం అందించడంతో పాటు, పుట్టిన పిల్లలు ఎదుగుదలకు బాలామృతం ప్లస్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఆయన అన్నారు.
ఆసుపత్రులలో వంద శాతం ప్రసవాలు జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగే ప్రసవాలు మన జిల్లాలో 30 నుంచి 70 శాతానికి పెరిగాయన్నారు. ఆడపిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీం బృందాలను ఏర్పాటు చేసి, ముఖ్యమైన ప్రదేశాలలో సిసి కెమెరాలు ద్వారా నిరంతర నిఘా పెట్టిందని అన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ జనాభాలో సగభాగం మహిళలు ఉన్నట్లు, ముదితలు నేర్వగా లేని విద్య లేదే ఇలలో అని పెద్దలు అన్నట్లు ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నట్లు తెలిపారు.
పట్టుదలతో ఏ కార్యక్రమం అయిన మహిళలు విజయవంతం చేస్తారన్నారు. పాఠశాలల రూపురేఖలు మార్చినట్లు, నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు, ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. మహిళలను గౌరవించిన రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆసరా పెన్షన్లు, షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటుతో, తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా ఉందని అన్నారు.
ఈ సందర్భంగా రఘునాథపాలెం మండల కేంద్ర స్వేచ్ఛ స్వయం సహాయక సంఘానికి రూ.2.30 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణ చెక్కును, పీఎంఎఫ్‌ఎంఇ క్రింద 30 శాతం సబ్సిడీపై మహిళా సమైక్యకు రూ.1.80 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణ చెక్కును సంఘ సభ్యులకు అందజేశారు. చేయూత వాహనాన్ని కలెక్టర్ మేయర్ తో కలిసి ప్రారంభించారు. ఐసిడిఎస్ వారిచే 300 రకాల పౌష్టికాహార తినుబండారాలు, స్వయం సహాయక సంఘాల సభ్యులచే జ్యుట్ బ్యాగులు, బనియన్స్, పచ్చళ్ళు, హోమ్ ఫుడ్స్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. మేయర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌లు బతుకమ్మ, కోలాటం ఆడి, మహిళలను ఉత్సాహపరిచారు. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళలను ఘనంగా సన్మానించి, మెమోంటోలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దోరేపల్లి శ్వేత, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టేంట్ కమీషనర్ బైరు మల్లేశ్వరీ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, రఘునాథపాలెం ఎంపిపి గౌరీ, కార్పొరేటర్లు, డీఆర్డీఓ విద్యాచందన, జిల్లా సంక్షేమ అధికారిణి జి.జ్యోతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి విజయలక్ష్మి,కార్పోరేటర్లు కర్నాటి క్రష్ణ, రుద్రాగిని శ్రీదేవి, పగడాల శ్రీవిద్య, ప్రసన్న క్రష్ణ తపలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.