మణుగూరు : ప్రజా ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్షమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండలంలోని స్నేహ గార్డెన్స్ నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ వైద్యారోగ్య సందర్భంగా గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లను ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య అధికారులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, మంచి ఆరోగ్యం అందించాలన్న లక్షంతో సిఎం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లను అందిస్తున్నారన్నారు. గర్భిణీల సంక్షేమం గురించి ఆలోచించి సిఎం కెసిఆర్ కేసీఆర్ కిట్ స్కీమ్‌ను ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ న్యూట్రీషన్ ఆహార పదార్థాలను స్వీకరిస్తూ గర్భిణీ స్త్రీలు మంచి ఆరోగ్యాన్ని పొందాలన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పులు జరిగి శిశువు పుడితే రూ.13వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు, కెసిఆర్ కిట్లు అందిస్తున్నామన్నారు. గర్భిణీగా పేరు నమోదైనప్పటి నుంచి ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలతో తరచూ వైద్య పరీక్షలతో పాటు అంగన్వాడీల ద్వారా సంపూర్ణ పౌష్టికాహారంలో భాగంగా భోజనం గుడ్లు పాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.