అహ్మదాబాద్ : అరేబియా సముద్రంలో నెలకొన్న పెను భీకర తుపాన్ బిపొర్‌జాయ్ గురువారం సాయంత్రం తీరాన్ని తాకనుంది. నెమ్మదిగా కదులుతున్న ఈ తుపాన్ గురువారం గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు, దరిదాపుల్లోని పాకిస్థాన్ కరాచీ తీర ప్రాంతాల మధ్య ఎక్కడైనా తీరం దాటే వీలుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) బుధవారం తెలిపింది. తుపాన్ ఇప్పుడు గుజరాత్‌లోని కచావూ రేవుకు దాదాపు 280 కిలోమీటర్ల దూరంలో ఉందని బుధవారం సాయంత్రం అధికారులు తెలిపారు. తుపాన్ ప్రభావం ఎక్కువగా గుజరాత్ తీర ప్రాంతం నుంచి ముంబై తీరం వరకూ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. దీనితో ఇప్పటికే మూడు నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున తుపాన్ తాకిడి ఉండే ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తుపాన్ తీవ్రస్థాయి ఉధృత రీతిలో ఉంటుందని నిర్థారించారు.
దీనితో సహాయక చర్యల కోసం డజన్‌కు పైగా జాతీయ విపత్తు నిర్వహణ (ఎన్‌డిఆర్‌ఎఫ్) దళాలను సిద్ధంగా ఉంచారు. స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి ఎప్పటికప్పుడు సహాయక చర్యలపై సమీక్షిస్తున్నారు. కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్‌కె సింగ్ ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా, ఎప్పటికప్పుడు పునరుద్ధరణ పనులను సమీక్షిస్తున్నారు. తుపాన్ ప్రభావంతో రెడ్ అలర్ట్ వెలువరించారు. రైళ్లు విమానాలు రద్దు అయ్యాయి. గుజరాత్‌లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు జిల్లాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎనిమిది రాష్ట్రాలు, డయ్యూ డామన్, లక్షద్వీప్, దాద్రానగర్ కేంద్ర పాలిత ప్రాంతాలలో తుపాన్ కారణంగా భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనితో లోతట్లు ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నారు.
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న జకావూ రేవు ఇప్పుడు జాలర్లు అంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడంతో కాలనీలకు కాలనీలు నిర్మానుష్కంగా మారాయి. పలు చోట్ల కాలనీల్లో తోపుడుబండ్లు, మరపడవలు కన్పిస్తున్నాయి. గురువారం గండం గడిచే వరకూ జాలర్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి ఏర్పడింది. తుపాన్‌తో సౌరాష్ట్ర, ద్వారకా, కచ్ తీరాలలో రెడ్ అలర్ట్ వెలువరించారు. ఈ తుపాన్ భీకర నష్టానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
గంటకు 150 కిలోమీటర్ల వేగపు గాలులు?
తుపాన్ గుజరాత్‌లోని మాండ్వీ, పాకిస్థాన్‌లోని కరాచీ మధ్య గుజరాత్‌లోని జకావూ రేవు వద్ద తీరం దాటనుంది. దీని ప్రభావంతో కనీసం 125 నుంచి 135 గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనావేశారు. గుజరాత్, రాజస్థాన్ వరకూ తుపాన్ ప్రభావం పడుతుంది. పరిస్థితితో ఏర్పడే సవాళ్లను ఎదుర్కొనేందుకు , పౌరులను కాపాడేందుకు సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. గుజరాత్ తీర ప్రాంతంలోని పలు గ్రామాలలో బిఎస్‌ఎఫ్ బృందాలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కచ్ గ్రామంలోని ప్రజలు ఖాళీ చేయడానికి ముందుగా అంగీకరించలేదు. తాము ఎక్కడికి తరలివేళ్లేది లేదని భీష్మించుకున్నారు. చివరికి ఎన్‌డిఆర్‌ఎఫ్ బలగాలు, జిల్లా అధికారులు వచ్చి నచ్చచెప్పడంతో చివరికి సహాయక కేంద్రాలకు వెళ్లారు.
ఇప్పటికే పలు ప్రాంతాలలో సముద్రపు నీరు గ్రామాలలోకి చొచ్చుకురావడం , అలలు భీకరంగా ఉండటంతో పలు చోట్ల గ్రామాలు ఖాళీ అయ్యాయి. సహాయక చర్యలకు భారతీయ నౌకాదళం సిద్ధం అయింది. ఐఎన్‌ఎస్ హన్సా, ఐఎన్‌ఎస్ షికారా, పి 81 యుద్ధ విమానాలను సంసిద్ధంగా ఉంచారు. భుజ్ విమానాశ్రయ టర్మినల్‌ను ఈ నెల 16వరకూ మూసివేసి ఉంచుతారు. తుపాన్ తీవ్రత దశలో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో వచ్చే నాలుగురోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని స్కైమెట్ వాతావరణ సంస్థ తెలిపింది. తుపాన్‌తో దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు లేవు. అయితే అక్కడక్కడ చెదురుమదురు వానలకు వీలుంది. రుతుపవనాల కదలికపై ఇప్పటి తుపాన్ ప్రభావం ఉండకపోవచ్చునని విశ్లేషిస్తున్నారు. తుపాన్ కదలికలు రుతుపవనాల దిశకు దూరంగా ఉన్నాయని, వీటిని తుపాన్ తాకే పరిస్థితి లేదని వాతావరణ విభాగం తెలిపింది.