Monday, November 25, 2024

ఆ కాలనీలో లుంగీలు, నైటీలతో బయట తిరగడం బ్యాన్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కొన్ని ఆలయాలలో ప్రవేశానికి డ్రెస్ కోడ్ తప్పనిసరి. ఇష్టం వచ్చిన దుస్తులతో ఆలయ ప్రవేశం కొన్ని చోట్ల నిషిద్ధం. అయితే..ఇది ఆలయాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా హౌసింగ్ సొసైటీలలో ఒకటి ఇలాంటి డ్రెస్ కోడే తమ కాలనీ నివాసులకు విధించింది. ఇళ్లలో ధరించే లుంగీలు, నైటీలతో బయటకు రావద్దంటూ ఆ హౌసింగ్ సొసైటీ తమ కాలనీలో నివసించే వారికి ఆదేశాలు జారీచేసింది. అయితే ఏ కారణం చేతనో నాలుగు రోజులకే ఆ నోటీసును ఉపసంహరించుకుంది.

గ్రేటర్ నోయిడా గ్రూపు హౌసింగ్ సొసైటీలలో ఒకటైన హిమ్‌సాగర్ అపార్ట్‌మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ జూన్ 10వ తేదీన ఒక నోటీసు జారీచేసింది. లుంగీలు, నైటీలతో తిరగడం ఇళ్లకే పరిమితం చేసుకోవాలని, అవి ధరించి కాలనీలో తిరగడానికి వీల్లేదంటూ ఆ నోటీసులో ఆదేశించింది. కాలనీవాసులు కొందరు అభ్యంతరకర దుస్తులతో బయటకు వస్తున్నారని, వారి వల్ల తమకు ఇబ్బందిగా ఉందంటూ కొందరు చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ ఈ నోటీసు జారీచేసింది. ఇళ్లలోనుంచి బయటకు వచ్చేటప్పుడు మీ దుస్తులు, మీ ప్రవర్తన సమాజంలో ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, ఎవరికీ అభ్యంతరకరంగా ఉండరాదని సొసైటీ కాలనీవాసులకు హితవు చెప్పింది.

అయితే, ఈ నోటీసు కొందరి మనోభావాలను దెబ్బతీయడంతో దీన్ని ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం మరో నోటీసులో సొసైటీ పేర్కొంది. తాము డ్రెస్‌కోడ్‌ను ఎవరిపైన బలవంతంగా రుద్దడం లేదని, ఎవరి మనోభావాలను గాయపడరచడం తమ ఉద్దేశం కాదని కూడా పేర్కొంది. కాలనీవాసి ఒకరు లుంగీ ధరించి పార్కులో యోగా చేస్తున్నట్లు కొందరు మహిళలు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని ఈ డ్రెస్‌కోడ్ విధించామని, కాని ఈ నోటీసును ఉపసంహరించుకుంటున్నామని సొసైటీ అధ్యక్షుడు సిబి కల్రా తెలిపారు.

ఇది దక్షిణాదికి చెందిన వారికి వ్యతిరేకంగా ఉందంటూ వస్తున్న విమర్శలకు ఆయన స్పందిస్తూ తమ కాలనీలో నివిసంచే 250 కుటుంబాలలో ఒక్కరు కూడా దక్షిణాది వాళ్లు లేరని ఆయన స్పష్టం చేశారు. డ్రెస్ కోడ్‌పై కాలనీవాసులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, కాని కొందరు వెలుపలి వ్యక్తులే సోషల్ మీడియాలో దీనిపై నానా యాగీ చేస్తున్నారని రిటైర్డ్ ప్రభుత్వ అధికారి అయిన ఆయన చెప్పడం తమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News