Sunday, January 19, 2025

పార్లమెంట్ లోనే లైంగిక దాడికి గురయ్యా: మహిళా ఎంపి సంచలన ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ఆస్ట్రేలియా దేశ పార్లమెంట్ వేదికగా తనపై తోటి సభ్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళా ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంగా పిలిచే ఈ పార్లమెంట్ భవనం మహిళల విధులకు ఏమాత్రం భద్రత కల్పించడం లేదని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. ఈ మేరకు సెనేట్ సభలో ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు. కన్సర్వేటివ్ పార్టీకి చెందిన సెనేటర్ డేవిడ్ తనతో దారుణంగా ప్రవర్తించారని స్వతంత్ర మహిళా సెనేటర్ ఆరోపించారు. గురువారం సెనేట్‌లో ప్రసంగిస్తూ తనపై జరిగిన వేధింపులను వివరించారు. ఆయన తనను అనుసరించేవారని, అసభ్యకరంగా తాకే వారని, శృంగార కార్యకలాపాల కోసం ప్రతిపాదించేవారని, దీంతో ఆఫీస్ గదిలో నుంచి బయటకు రాడానికి భయపడేదానినని, డోర్ కొంచెం తెరిచి ఆయన లేరని నిర్ధారించుకున్న తరువాతనే బయటకు వచ్చేదానినని ఆమె విలపించారు. పార్లమెంట్ ప్రాంగణంలో నడిచేటప్పుడు తనకు తోడుగా ఎవరో ఒకరు ఉండేలా చూసుకున్నానన్నారు.

నాలాగే మరికొందరు ఇలాంటి వేధింపులకు బలవుతున్నారని తెలుసునని, కానీ కెరీర్ పోతుందన్న భయంతో వారు బయటపడడం లేదని, ఈ భవనం మహిళలకు సురక్షిత ప్రదేశం కాదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. పార్లమెంట్ నిబంధనలకు అనుగుణంగా దీనిపై తాను కేసు పెట్టనున్నట్టు చెప్పారు. అయితే ఈ ఆరోపణలను డేవిన్ వాన్ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ అవాస్తవాలేనని కొట్టి పారేశారు. దీనిపై తాను న్యాయపరంగా పోరాడుతానని తెలిపారు. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఓ మహిళ పార్లమెంట్‌లో తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించింది. 2019 మార్చిలో పార్లమెంట్ లోని నాటి రక్షణ మంత్రి లిండా రెనాల్డ్ ఆఫీస్‌లో పనిచేసే ఓ సీనియర్ సిబ్బంది తనను సమావేశం ఉందని పిలిచి అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపించింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో నాటి ప్రధాని స్కాట్ మారిసన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత మహిళకు క్షమాపణలు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News