ఖమ్మం : ఫైళ్ల నిర్వహణ ఈ – ఆఫీస్ ద్వారా చేపట్టాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ కోరారు. గురువారం కలెక్టర్ ఐడిఓసిలోని వివిధ కార్యాలయాలు పరిశీలించి, సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, ఆరోగ్యశ్రీ, రోడ్లు భవనాల శాఖ, వ్యవసాయ శాఖ, కలెక్టరేట్, ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా ఉపాధికల్పనాధికారి, జిల్లా టూరిజం అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, సెర్ప్ కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు.
కార్యాలయ సిబ్బంది వివరాలు, ఎవరు ఏఏ విభాగాల విధులు నిర్వర్తించేది అడిగి తెలుసుకున్నారు. పాత ఫైళ్లను నిబంధనల మేరకు ఖండనము చేయాలని, అవసరం లేని ఫైళ్లను తొలగించాలని అన్నారు. పాత ఫైళ్ళతో డస్ట్ ఏర్పడి, ఆరోగ్య సమస్యలు వస్తాయని, అనవసరంగా భద్రపర్చడంతో నిల్వ సమస్యలు వస్తాయని అన్నారు. రన్నింగ్ ఫైళ్లు, నిబంధనల మేరకు భద్రపర్చాల్సిన ఫైళ్లు మాత్రమే ఉండాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ విభాగం, ఎన్నికల విభాగాల్లో ఇంటర్నెట్, పవర్ పాయింట్ల సమస్యలు పరిష్కరించినట్లు, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
కార్యాలయం లోపల మంచి వాతావరణం ఉండాలని, పరిశుభ్రతను పాటించాలని ఆయన తెలిపారు. కలెక్టర్ వెంట శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి.మాలతి, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయ నిర్మల, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.