బెంగళూరు: ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లో ఫేస్‌బుక్ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. సౌదీ అరేబియా జైలులో ఉన్న భారతీయుడికి సంబంధించిన కేసు దర్యాప్తులో దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది. కర్ణాటకకు చెందిన శైలేష్ కుమార్ పాతికేళ్లుగా సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే ఫేస్‌బుక్‌లో సౌదీ రాజుపై ఇస్లాం మతంపై అభ్యంతరకర పోస్ట్ పెట్టాడని ఆరోపిస్తూ శైలేష్‌ను 2019లో అక్కడి పోలీస్‌లు అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించారు.
తన పేరుతో దుండగులు నకిలీ ఖాతా సృష్టించారని శైలేష్ ఎంత చెప్పినా, అక్కడి అధికారులు వినిపించుకోలేదు. ఈ విషయం తెలిసి శైలేష్ భార్య కవిత మంగళూరులో పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. నకిలీ ఖాతా వివరాలు తెలియజేయాలని పోలీస్‌లు ఫేస్‌బుక్‌కు లేఖ రాశారు. కానీ ఫేస్‌బుక్ స్పందించలేదు. దీంతో 2021లో శైలేష్ భార్య కవిత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. సౌదీ అరేబియా లోని ఓ సంస్థలో తన భర్త గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, 2019లో శైలేష్ కుమార్ పౌరసత్వ సవరణఱ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్ ఎన్‌ఆర్‌సికి అనుకూలంగా ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారని పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఆ తరువాత ఎవరో ఆయన పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా తెరిచి, సౌదీ అరేబియా దేశంపై , ఇస్లాం మతంపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని వివరించింది.
ఈ విషయం తన భర్త ద్వారా తెలుసుకుని మంగళూరు పోలీస్‌లకు ఫిర్యాదు చేశానని పిటిషన్‌లో వివరించింది. కవిత పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసు విచారణకు సహకరిస్తూ అవసరమైన సమాచారంతో పూర్తి నివేదికను వారం రోజుల్లో కోర్టుకు సమర్పించాలని పేస్‌బుక్‌ను ఆదేశించింది. లేని పక్షంలో భారత్‌లో ఫేస్‌బుక్ సేవలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. మంగళూరు పోలీస్‌లు కూడా సమగ్ర విచారణ చేపట్టి నివేదికను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను జూన్ 22 కు వాయిదా వేసింది.