నిజామాబాద్ బ్యూరో: ప్రభుత్వ దూరదృష్టి నిర్ణయాలు, దార్శనిక పాలనతో అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధిని సాధించిన ప్రగతిని స్మరించుకుంటూ ఈ స్ఫూర్తితో సాధించాల్సిన లక్షాల వైపు మరింత ఉత్సాహంగా అడుగులు వేసేందుకు వీలుగా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు పల్లెల ప్రగతిని ఆవిష్కరింపజేశాయి. ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్‌లు వంటి హంగులతో అలరారుతున్న పల్లెలన్నీ పచ్చదనం, పరిశుభ్రత నడుమ దశాబ్ధి వేడుకలకు వేదికలుగా నిలిచాయి. దశాబ్ధి సంబురాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గల 530 గ్రామ పంచాయతీల్లో గురువారం నిర్వహించిన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమాలలో ఎటుచూసినా పండగ వాతావరణం కనిపించింది. గ్రామ పంచాయతీలు, పల్లె ప్రకృతి వనాలు తదితర వాటిని మామిడాకులు, పూల తోరణాలతో అలంకరించారు. అందమైన రంగవల్లులతో పల్లెలల్లో వీధుల సాధారంగా స్వాగతం పలికాయి.
జిల్లా పాలనాధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు నిశిత పరిశీలనలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ విస్తృత ఏర్పాట్లు చేయడం వల్లే పల్లె ప్రగతి సభల విజయవంతానికి దోహదపడింది. దీంతో అధికారులు సిబ్బందితో పాటు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా ర్యాలీల్లో తరలివచ్చి పలెల ప్రగతి దినోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామ పంచాయతీల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధర్పల్లిలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొనగా, సాటాపూర్‌లో బోధన్ ఎమ్మెల్యే మహమద్ షకీల్ ఆమీర్, నందిపేటలో జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు భాగస్వాములయ్యారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు సమకూరిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులు, మెరుగుపడిన మౌలిక వసతులు, సాధించిన ప్రగతితో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల వివిధ వర్గాల వారికి చేకూరిన లబ్ధి గురించి వక్తలు వివరించారు.
గ్రామస్తులతో కలిసి పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులను సందర్శించి పచ్చదనం, పరిశుభ్రతతో అలరారుతున్న పల్లె సీమల ముఖచిత్రాన్ని ప్రత్యక్షంగా చూపించారు. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో వివిధ కార్యక్రమాల ద్వారా వెచ్చించిన నిధులు, చేపట్టిన పనుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు గ్రామ కూడళ్లలో ప్రదర్శిస్తూ , పారదర్శక తీరుతో ప్రజలకు వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. సఫాయి కార్మికుల సేవలను కొనియాడుతూ సఫాయి అన్నా సలాం అంటూ ఏర్పాటు చేసిన ఫెక్లీలు కార్మికుల గౌరవాన్ని ఇనుమడింపచేశాయి. ప్రగతి బాటలో సాగుతున్న గ్రామ పంచాయతీలు ఇప్పటికే జాతీయ, రాష్ట్రా స్థాయిలో సాధించిన అవార్డుల గురించి తెలియచేస్తూ, పల్లెల సమగ్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు ,ప్రజా ప్రతినిధులు ప్రజలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌కు తరలివెళ్లిన ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచులు
వివిధ అంశాల ప్రాతిపదికన జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన జీపీల సర్పంచులు జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ నేతృత్వంలో గురువారం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. జిల్లా నుంచి మొత్తం 27మంది సర్పంచులు , ఇద్దరు మల్టీపర్పస్ వర్కర్లు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరి వెళ్లారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో వీరిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, హరీష్‌రావుల చేతుల మీదుగా సన్మానించేందుకు హైదరాబాద్‌కు ఆహ్వానించారు.