హైదరాబాద్: ఉత్తర తెలంగాణ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ ట్రైన్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా సికింద్రాబాద్- టు నాగ్‌పూర్‌ల మధ్య వందేభారత్ రైలు నడిపేందుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే ఈ రూట్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి. సాధారణ కార్యకలాపాలకు అనువుగా ఉందని రైల్వే శాఖ నిర్ధారణకు వచ్చింది. ఈ వందేభారత్ రైలు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరాన్ని హైదరాబాద్‌తో అనుసంధానం చేస్తుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణకాలం మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం ప్రయాణ కాలం 2 గంటలు తగ్గనుంది.
సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయంతో పాటు మహారాష్ట్రలోని బల్హార్షాలో దీనికి స్టాప్ ఉండనుంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు ఈ రైలు సదుపాయం కలిసిరానుంది. దీంతోపాటు సికింద్రాబాద్- టు ఫుణే శతాబ్ది సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్థానంలో సికింద్రాబాద్- టు ఫుణే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తీసుకురావాలని కేంద్రం పరిశీలిస్తోంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఫుణే వరకు పరిమిత స్టాప్‌లతో 8.25 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు అధునాతన సేవలను అందే అవకాశం ఉందని రైల్వే శాఖ భావిస్తోంది.