న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య( డబ్లుఫ్‌ఐ) చీఫ్‌పై మైనర్ రెజ్లర్ దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు నివేదిక సమర్పించడంపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడింది.‘ న్యాయం కోసం భారతీయ ఆడబిడ్డలు చేసిన ఆక్రందనను మోడీ ప్రభుత్వం చెత్తబుట్టలో పడేసి భూస్థాపితం చేసింది’ అని ఆ పార్టీ దుయ్యబట్టింది.‘ బేటీ డరావో.. బ్రిజ్‌భూషణ్ బచావో’అన్నది బిజెపి కొత్త నినాదంగా మారిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. భారతీయ క్రీడలకు ఇది ‘బ్లాక్‌డే’ అని ఆయన అంటూ, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను కాపాడడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాగాన్ని రంగంలోకి దించారని ఆరోపించారు.‘ ఆడబిడ్డలను భయపెట్టండి.. బ్రిజ్‌భూషణ్‌ను కాపాడండి అనేదే బిజెపి అసలైన నినాదం. ఈ రోజు భారతీయ క్రీడలకు ‘బ్లాక్ డే’. బిజెపి రాజకీయ బుల్‌డోజర్ కింద ఈ రోజు ఈ దేశన్యాయవ్యస్థ కుప్పకూలి నలిగి పోయింది.
న్యాయం కోసం భారత ఆడబిడ్డలు చేస్తున్న ఆక్రందనను మోడీ ప్రభుత్వం చెత్తబుట్టలో పడేసి భూస్థాపితం చేసింది’ అని సుర్జేవాలా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ నియంత’ ఫేవరేట్ ను (బ్రిజ్‌భూషణ్)ను కాపాడడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించారు’ అని కూడా ఆయన ఆ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. సింగ్ లాంటి బలమైన వ్యక్తికి వ్యతిరేకంగా ఒక మైనర్ బాలిక పోక్సో చట్టంకింద ఫిర్యాదు చేసింది. దాని తర్వాత మొత్త వ్యవస్థ , పోలీసులు, ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు అందరూ ఆ బాలికకు వ్యతిరేకంగా నిలవడమే కాకుండా బ్రిజ్‌భూషణ్‌కు రక్షణ కల్పించారు.‘ బేటీ డరావో.. బ్రిజ్‌భూషణ్ బచావో’అన్నదే ఈ రోజు భారతీయ జనతా పార్టీ నినాదం ’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే విమర్శించారు. ఎక్కడ మహిళలపై నేరం జరిగినప్పుడుఆ బాలికకు మద్దతుగా కాక నేరానికి పాల్పడిన వారికి బిజెపి అండగా నిలవడం ఆనవాయితీగా మారిపోయిందని కూడా ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.