రెండో రోజూ కొనసాగుతోన్న సోదాలు
హైదరాబాద్ : ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత రెండు రోజులుగా బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంఎల్‌ఎల ఇళ్లలో ఐటి సోదాలు నిర్వహించారు. భువనగిరికి చెందిన ఎంఎల్‌ఎ పైళ్ల శేఖర్ రెడ్డి, అలాగే నాగర్ కర్నూల్ కు చెందిన ఎంఎల్‌ఎ మర్రి జనార్దన్ రెడ్డి నివాసాల్లో ఐటి అధికారులు నిర్వహిస్తోన్న సోదాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఎంఎల్‌ఎ పైళ్ల శేఖర్ రెడ్డి వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో మైనింగ్ వ్యాపారాన్ని శేఖర్ రెడ్డి సంస్థలు నిర్వహిస్తున్నాయి. హిల్‌ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు కంపెనీలకు కూడా శేఖర్ రెడ్డి భార్య వనితి డెరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న తీర్థ గ్రూప్ సంస్థలో కూడా సోదాలు చేపట్టారు. ఒకేసారి 12 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ కు చెందిన ఎంఎల్‌ఎ జనార్ధన్ రెడ్డి ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో కూడా ఐటి సోదాలు నిర్వహించారు.
కూకట్‌పల్లిలో ఎంఎల్‌ఎకు చెందిన కార్యాలయాలు, గోదాములతో పాటు జెసి బ్రదర్స్ మాల్స్‌లోనూ ఏక కాలంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. జనార్ధన్ రెడ్డి వ్యాపారాలతో సంబంధమున్న బంధువులు, సిబ్బంది నివాసాలపై కూడా సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.. మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసముంటున్న విల్లాతోపాటు ఆయన ఛైర్మన్ గా కొనసాగుతున్న సోనీ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ కార్యాలయాలపైన కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులకు సంబంధించిన స్థిరాస్తులు, వ్యాపారాలు, హోటల్స్, మాల్స్ ఇతర సంస్థలపై దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి జరుగుతున్న ఈ సోదాల్లో దాదాపు యాభై బృందాలు పాల్గొన్నట్లు ఐటి అధికారులు చెప్తున్నారు. ఈ ముగ్గురు నేతలు సంబంధించిన వ్యాపార లావాదేవీలు, చెల్లిస్తున్న ఆదాయ పన్నుల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారట. ఆ మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.
ఐటి సోదాల పట్ల బిఆర్‌ఎస్ నేతల ఆగ్రహం
మరోవైపు ఐటి సోదాల పట్ల బిఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను నేరుగా ఎదుర్కోలేక బిజెపి ఇలా సోదాలు చేస్తుందంటూ విమర్శిస్తున్నారు. ఎన్నికల వేళ ఇలాంటి దాడులు సహజమే అని ఇదంతా బిజెపి ఆడిస్తున్న నాటకమే అన్ని మండిపడుతున్నారట గులాబీ నేతలు. గతంలో కూడా బిఆర్‌ఎస్ నేతలు మంత్రి మల్లారెడ్డి అలాగే మంత్రి గంగుల కమలాకర్, బిఆర్‌ఎస్ ఎంపీ గాయత్రి రవి ఇళ్లల్లో కూడా ఐటి సోదాలు నిర్వహించిన సంగతి విదితమే.