కామారెడ్డి ప్రతినిధి : కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో మున్సిపల్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ విప్ మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 9 ఏళ్ల్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలకు ప్రజలకు తెలియజేయడానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుందన్నారు. ముఖ్యమంతి కెసిఆర్ ,మంత్రి కెటిఆర్ సహాకారంతో కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళతానని చెప్పారు. రూ.214 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ ప్రతిపక్ష వార్డులకు సైతం సమానంగా నిధులు ఇచ్చి అన్ని వార్డులను అభివృద్ధ్ది చేశామని తెలిపారు.
నిధుల కేటాయింపు పరంగా ఎలాంటి వ్యత్యాసం చూపలేదని చెప్పారు. నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవి విహార్ వరకు నాలుగు లైన్ల రోడ్డు వేయించినట్లు పేర్కొన్నారు. చౌరస్తా నుంచి హౌసింగ్ బోర్డు వరకు ఆరు లైన్ల రోడ్డు సెంటర్ లైటింగ్ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇందిరా చౌక్, నిజాంసాగర్ చౌరస్తా, జమప్రకాష్ నారాయణ చౌరస్తా వద్ద జంక్షన్ లను అభివృద్ది చేస్తామని చెప్పారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చెందడానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. పట్టణ ప్రగతి ద్వారా కామారెడ్డి పట్టణం రూపు రేఖలు మారాయని తెలిపారు. పట్టణంలో పచ్చదనం పెరిగిందని చెప్పారు.
కరోనా సమయంలో పారిశుద్య సిబ్బంది చేసిన కృషిని కొనియాడారు. మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాలనలో మున్సిపల్ నివేదిక చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఐదు కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేశారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను ఇచ్చారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియ, కౌన్సిలర్లు, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.