మణిపూర్‌లో కేంద్రమంత్రి ఇంటిపై దాడి
పెట్రోల్ బాంబులతో దాడి చేసిన నిరసనకారులు
కేరళలో కార్యక్రమాలు రద్దు చేసుకున్న మంత్రి
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో హింసాకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఇప్పటికీ చల్లారలేదు. నెలరోజులు దాటినా రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. తాజాగా గురువారం రాత్రి వెయ్యి మందికి పైగా నిరసనకారులు ఇంఫాల్‌లోని కేంద్ర మంత్రి ఆర్‌కె రంజన్ సింగ్ ఇంటిపై దాడి చేశారు. దాడి సమయంలో గుంపుగా ఎగబడిన జనం మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరినట్లు ఆయన నివాసం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వెల్లడించారు. అయితే దాడి సమయంలో మంత్రి ఇంట్లో లేరని మణిపూర్ అధికారులు తెలిపారు. ఇంఫాల్‌లో కర్ఫూ అమలులో ఉన్నప్పటికీ ఆందోళనకారులు కొంగ్బాలోని మంత్రి ఇంటిపై దాడి చేశారు.ఆ సమయంలో మంత్రి ఇంటివద్ద తొమ్మిది మంది ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డ్, ఎనిమిది మంది అడిషనల్ గార్డ్ డ్యూటీలో ఉన్నారని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కాగా భారీగా నిరసనకారులు దూసుకు రావడంతో వారిని అడ్డుకోలేకపోయామని ఎస్కార్ట్ కమాండర్ ఎల్ దినేశ్ సింగ్ వెల్లడించారు.
మంత్రి ఇంటిముందు, వెనక, అన్ని వైపులనుంచి బాంబులు విసరడంతో పరిస్థితిని నియంత్రించలేకపోయామని ఆయన చెప్పారు. దాడి చేసిన గుంపు మంత్రి ఇంటికి నిప్పు పెట్టడానికి చేసిన ప్రయత్నాలను సెక్యూరిటీ గార్డులు, అగ్నిమాపక సిబ్బంది అడ్డుకొని మంత్రి ఇల్లు తగులబడకుండా కాపాడగలిగారని పోలీసులు తెలిపారు.గురువారం మధ్యాహ్నం ఇంఫాల్ పట్టణం నడిబొడ్డున మణిపూర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్లకు, జనానికి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న తర్వాత ఈ పరిణామం జరగడం గమనార్హం. మంత్రి ఇంటిపై దాడి చేసిన మూకలో దాదాపు 1200 మంది ఉన్నారని పోలీసులు చెప్పారు. కాగా రంజన్ సింగ్ ఇంటిపై దాడి జరగడం ఇది రెండో సారి. గత మే నెలలో కూడా ఆయన ఇంటిపై దాడికి యత్నం జరగ్గా, భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి నిరసనకారులను చెదరగొట్టారు.
కార్యక్రమాలు రద్దు చేసుకున్న మంత్రి
కాగా, మోడీ ప్రభుత్వంలో విదేశాంగ శాఖ సహాయమంత్రిగా ఉన్న మంత్రి రంజన్ సింగ్ పార్టీ పనుల మీద కేరళ వచ్చారు. తన ఇంటిపై దాడి జరిగిందన్న విషయం తెలియగానే కేరళలో పార్టీ కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని ఇంఫాల్ బయలుదేరారు. కాగా ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం మణిపూర్‌లో జరుగుతున్న ఘర్షణలు మత ఘర్షణలు కాదని, రెండు వర్గాల మధ్య నెలకొన్న దురభిప్రాయం కారణంగా తలెత్తినవని చెప్పారు. తాను చెమటోడ్చి, కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న తన ఇంటిని కూడా తగులబెట్టారని మంత్రి అంటూ, తానూ హిందువునే అని, దాడి చేసిన వారు కూడా హిందువులే కాబట్టి ఇది మతపరమైన దాడి కాదని అన్నారు.
గత నెలలో ఘర్షణలు మొదలైనప్పటినుంచి తాను ఇరు వర్గాల మధ్య రాజీ కుదర్చడానికి తాను ప్రయత్నిస్తూనే ఉన్నానని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఆయన మెయిటీ, కుకీ వర్గాలకు చెందిన ప్రముఖులతో చర్చలు కూడా జరిపారు. అలాగే హింసను ప్రేరేపిస్తున్న స్థానిక నేతలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు.