- ఉత్సాహంగా దశాబ్ది ఉత్సవాలు
సంగారెడ్డి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సంగారెడ్డి జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. గత 9సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందాయి. దీంతో ఆయా పథకాల లబ్ధిదారులు, ప్రజలతో నిత్యం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శనివారం దీనిలో భాగంగా గిరిజనోత్సవాన్నీ పెద్ద ఎత్తున జరిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం గిరిజన తాండాలను పంచాయతీలుగా మార్చడంతో రూపు రేఖలు మారిపోయాయని గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ అన్నారు. శనివారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కంది మండల పరిధిలోని వడ్డెనగూడ తాండాలో గిరిజనోత్సవం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల హయాంలో గిరిజనుల జీవన స్థితిగతులు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో గిరిజనుల జీవన ప్రమణాలు ఏ విధంగా పెరిగాయో ఈ ఉత్సవం చూస్తేనే అర్థమవుతుందన్నారు. తాండాలను పంచాయతీలుగా చేసి వారి పరిపాలన వారికే అప్పగించిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. శాఖ పరంగా గిరిజనుల అభివృద్ధి కోసం నిరంతరం చర్చిస్తూనే ఉంటామని చెప్పారు. విద్యారంగాన్ని ఆలోచించి రాష్ట్రంలో 100 గురుకుల ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. ఒక వ్యక్తి చదువుకుంటే తన ఊరిని తన మార్చుకోగలరని అర్థమవుతుందన్నారు. ఉద్యోగాలు ఎలా సంపాదించాలి అనే దానిపై కొన్ని ఆర్గనైజేషన్‌లను ఏర్పాటు చేసి వాటి ద్వారా గిరిజన యువతీ యువకులకు చేయూత నందిస్తున్నామన్నారు.
వారు ఎదిగి మరింత మందికి ఉపాధి కల్పిస్తారన్నారు. సంవత్సరానికి వంద నుంచి 200 మంది యువతను ఐఎస్‌బిటి పంపి శిక్షణను ఇప్పించడం జరుగుతుందన్నారు. గిరిజనులు పరిపాలన చేసుకునేలా రాష్ట్రంలో 2000ల గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిందన్నారు. గతంలో తాండాలకు వెళ్లాలంటే రోడ్లు బాగుండేవి కావని, వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రెండు వేల పంచాయతీలకు 2100కోట్లతో రోడ్లును వేయించిందన్నారు. రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆలోచనలతో గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. సిఎం కెసిఆర్ గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.
మంత్రి హరీష్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లాలో తాండాలను అభివృద్ధి చేశామని, మంత్రి సహకారంతో తాండాలలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. కలెక్టర్ శరత్ మాట్లాడుతూ అభివృద్ధి జరుపుకోవడానికి ఇలాంటి పథకాలు కార్యక్రమాలు ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళుతున్నారన్నారు. కష్టపడి పనిచేసుకునే తత్వం గిరిజనుల్లో ఉంటుందని దానికి తోడు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు మరింత అండగా నిలిచిందన్నారు. గిరిజనులు ఐక్యంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకొని అభివృద్ధిలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఎస్‌పి రమణకుమార్, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, డిపిఓ సురేష్ మోహన్, సర్పంచ్ మునీ బాయ్, ఎంపిపి సరళ పుల్లారెడ్డి, జడ్‌పిటిసి కొండల్‌రెడ్డి, సిడిసి చైర్మెన్ బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నరహరిరెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మిలున్నారు.