Monday, December 23, 2024

కారు ఢీ కొని ఇద్దరు మహిళల దుర్మరణం

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలం రాయిచేడ్ గ్రామంలో శుక్రవారం (టిఎస్ యుఎప్ 7763) నెంబర్ గల కారులో వస్తున్న డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో కారు అదుపుతప్పి ఇంటి ముందు మంచంపై కూర్చున్న ఐదు మంది మహిళలపై దూసుకెళ్లిన సంఘటనలో ఆశా వర్కర్ అమృత(33), చింతకుంట్ల అనిత(22) ఇరువురు మృతి చెందారు. అదే విధంగా మరో మహిళ హుస్సేనమ్మ, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.

ఇందుకు సంబందించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నారం స్టేజి వద్ద నుంచి వంకమూతి తండాకు వెళ్లే క్రమంలో రాయిచేడ్ గ్రామంలో ఇంటి ముందర కూర్చున్న మహిళలపై తాగి ఉన్న డ్రైవర్ కారు అదుపుతప్పి అతివేగంగా మంచంపై దూసుకెళ్లడం ద్వారా ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని తెలిపారు. క్షతగాత్రులు ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కుటంబ సభ్యుల సూచన మేరకు కేసు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాయిచేడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న రాయిచేడు గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని శనివారం ప్రభుత్వ ఆసుపత్రి ముందు రాస్తారోకో నిర్వహించారు. పోలీస్ అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని నచ్చచెప్పడంతో వారు ఆందోళనను విరమించారు. సిఐ అనుదీప్‌ను వివరణ కోరగా కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం ద్వారానే ఈ ఘటన చోటు చేసుకుందని అతనిపై కేసు నమోదు చేసి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే విధంగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News