Friday, November 8, 2024

దేశానికే దిక్సూచిలా తెలంగాణ టెక్స్‌టైల్ పార్కులు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

వరంగల్ : రాష్ట్రంలో పక్కాగా నవంబర్, డిసెంబర్‌లలో ఎన్నికలు జరుగుతాయి. ప్రజల ఆశీర్వాదంతో కెసిఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర ఐటి, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తేల్చి చెప్పారు. ప్రతిపక్ష పార్టీల చిల్లరమల్లర మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం పరిధి గీసుకొండ మండల శాయంపేటలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో యంగ్ వన్ కంపెనీ వస్త్ర పరిశ్రమకు శనివారం మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. దక్షిణ కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీ ప్రతినిధి బృందం 298 ఎకరాలలో రూ.840కోట్లతో వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ సమక్షంలో ప్రకటించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. దేశంలోనే అత్యంత నాణ్యత ప్రమాణాలు కలిగిన పత్తి తెలంగాణలో పండుతుందని, నైపుణ్యమున్న చేనేత కార్మికులు కూడా ఇక్కడే ఉన్నారని, అందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటుచేస్తున్నారని తెలిపారు. చారిత్రక వరంగల్‌లో ఒకప్పుడు అజాంజాహి మిల్లు వేలాది మంది నేత కార్మికులకు అన్నం పెట్టిందని, గత పాలకుల నిర్లక్షం వలన మిల్లు మూత పడిపోయి నేతన్నల కుటుంబాలు ఆగమయ్యాయని అన్నారు. పామ్ టూ ఫ్యాషన్ విధానంలో ఇక్కడ పండుతున్న పత్తిని ఇక్కడే వస్త్ర పరిశ్రమల్లో వినియోగించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్షంతో ముఖ్యమంత్రి కెసిఆర్ దేశంలోనే అతి పెద్ద మెగా టెక్స్‌టైల్ పార్కును కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కుగా ఇక్కడ ఏర్పాటుచేశారని చెప్పారు.

2017లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు సిఎం శంకుస్థాపన చేసిన సమయంలో అందరిలో ఒకింత అనుమానాలు, అపోహాలు ఉండేవని, వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ఇప్పటి వరకు గణేష్, కిటెక్స్ తాజాగా యంగ్ వన్ కంపెనీ వస్త్ర పరిశ్రమలను తెచ్చామని ఆయన తెలిపారు. కిటెక్స్ కంపెనీతో 12వేల మందికి, గణేష్ కంపెనీతో వెయ్యి మందికి, యంగ్ వన్ కంపెనీతో 21వేల మందికి ప్రత్యక్షంగా, 60వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం రంగం తర్వాత టెక్స్‌టైల్స్ రంగంలో పెద్దయెత్తున ఉపాధి లభిస్తుందని తెలిపారు. తెల్ల బంగారం పత్తిని పండించే రైతులకు మంచి లాభాలు వచ్చేలా రాష్ట్రంలో టెక్స్‌టైల్ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు. టెక్స్‌టైల్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కులో అంతర్జాతీయ ప్రమాణాలతో వస్త్రాలు తయారవుతాయని, ఇక్కడ తయారైన వస్త్రాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి కానున్నాయని ఆయన తెలిపారు.

టెక్స్‌టైల్స్ పార్కులో భూములో కోల్పోయిన రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కరికి వంద గజాల చొప్పున నివేశన స్థలానికి సంబంధించిన పట్టాలను ఆగష్టు 15లోగా అందజేయాలని మంత్రి కెటిఆర్ కలెక్టర్‌ను ఆదేశించారు. 99 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, శానసమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, చేనేత జౌళి శాఖ కార్యదర్శి బుద్ద ప్రకాష్, టిఎస్ ఐఎండి నరసింహారెడ్డి, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, పరకాల, వర్థన్నపేట, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్ ఎంఎల్‌ఏలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ రాజయ్య, ఎంఎల్‌సి బస్వరాజు సారయ్య, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ, యంగ్ వన్ కంపెనీ చైర్మన్ చాంక్ జాయ్ జూకో, ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News