ఇంఫాల్ : మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగుతూ ఉన్నాయి. ఇప్పుడు సైన్యం, భద్రతాబలగాలతో ఘర్షణలు, పోలీసుస్టేషన్ల లూఠీకి పరిస్థితి దిగజారింది. పలు చోట్ల బిజెపి కార్యాలయాలను, బిజెపి నేతల నివాసాలను ఎంచుకుని గుంపులుగుంపులుగా వచ్చిన జనం దాడికి దిగుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన నాటి నుంచి శనివారం వరకూ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో నిరసనకారులు గుంపులుగుంపులుగా వచ్చి దాడులకు దిగుతూ వచ్చారు. వీరిని కట్టడి చేసేందుకు యత్నించిన భద్రతా బలగాలు, స్థానికపోలీసులతో వీరు తలపడ్డారు. కొన్ని ప్రాంతాలలో అత్యంత అధునాతన ఆటోమెటిక్ గన్స్ ఇతరత్రా ఆయుధాలతో భద్రతా బలగాలపై కాల్పులు జరిగినట్లు వెల్లడైంది. ఇంఫాల్ పట్టణంలో రాత్రి అంతా ఘర్షణలు, దగ్ధకాండ , పరస్పర దాడులకు యత్నాలతో తీవ్రస్థాయి ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.
ఆందోళనకారులు అధునాతన ఆయుధాలతో కలియతిరగడం కలకలానికి దారితీసింది. మరో వైపు అరాచకం పెరిగిపోతుందనే విషయాన్ని తెలియచేస్తూ ఇంఫాల్ వెస్ట్‌లోని ఇరింగ్బమ్ పోలీసుఠాణాపై ఓ గుంపు తెల్లవారుజామున దాడి జరిపింది. పోలీసు స్టేషన్‌లోని ఆయుధాలను ఎత్తుకువెళ్లేందుకు యత్నించింది. రాత్రి పూట అత్యంత సున్నితమైన, తెగల మధ్య ఘర్షణలకు ఆద్యమైన చురచంద్‌పూర్ జిల్లాలోని కాంగ్వాయ్, బిష్ణుపూర్ జిల్లాలోని వాట్కాలో వేర్వేరుగా నిరసనకారులు ఆటోమెటిక్ గన్స్‌తో కాల్పులకు దిగారు. శనివారం పలు చోట్ల జరిగిన ఘర్షణలలో పలువురు మృతి చెందినట్లు తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని, కొన్ని ప్రాంతాలలో బిజెపి నేతల ఇళ్లు తగులబెట్టేందుకు ఘర్షణలకు దిగిన వారు యత్నించారని అధికారులు తెలిపారు. నిరసనకారులు గుమికూడ ఉండేందుకు వారిని తిప్పికొట్టేందుకు ఇంఫాల్‌లో రాత్రిపూట చాలా సేపటివరకూ సైన్యం, అస్సామ్ రైఫిల్స్, మణిపూర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు సంయుక్త కవాతు నిర్వహించాయి.
అయితే దాదాపు వేయి మందితో కూడిన నిరసనకారుల గుంపు బెదరకుండా ఇంఫాల్‌లో పలు భవనాలకు నిప్పు పెట్టేందుకు యత్నించాయి. దాడులకు దిగాయి. అర్థరాత్రి తరువాత మరో గుంపు బిజెపి కార్యాలయాన్ని చుట్టుముట్టింది. పోరంపేట్ వద్ద బిజెపి మహిళా విభాగం అధ్యక్షురాలు శారదా దేవి ఇంటిపై దాడికి యత్నించారు. ఈ మూకను పోలీసులు చెదరగొట్టగలిగారు. మణిపూర్‌లో రిజర్వేషన్ల కోటా వ్యవహారం తీవ్రస్థాయిలో ఇప్పుడు తెగలు, కులాలు వర్గాల మధ్య చిచ్చుకు దారితీసింది. ఈ దశలోనే ఉగ్రవాద శక్తులు కూడా ఈ క్రమంలో చొరబడటం, వేర్పాటువాద సంస్థలు ఘర్షణలను రెచ్చగొట్టడంతో ఇక్కడి పరిస్థితి అరాచక దశను దాటి వెళ్లుతోంది.