మహబూబ్‌నగర్ / హన్వాడ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఎనిమిది తండాల్లో సుమారు కోటీ 27 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ. కోటీ 7 లక్షల రూపాయల వ్యయంతో ఆధునికరించిన బిటి రోడ్డును ప్రారంభించారు.
ఉపాధి హామీ పథకం కింద రూ. 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును మంత్రి ప్రారంభించారు. అంతేకాక 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సేవాలాల్ మహరాజ్ దేవాలయానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు తండాలను ఎవరు పట్టించుకోలేదని, తండాలలో తాగునీరు, రహదారులు, విద్యుత్, హాస్టళ్లు, పాఠశాలల వంటి సౌకర్యాలు లేక తాండా ప్రజలు ఎన్నో సంవత్సరాలు బాధలకు గురయ్యారన్నారు.
అలాంటిది తాండాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడమే కాకుండా, గిరిజనులకు రాజకీయంగా ఎన్నో పదవులను ఇచ్చి గౌరవం ఇచ్చామని తెలిపారు. గతంలో తినడానికి తిండి లేక లంబాడ గిరిజనులు పిల్లలను అమ్ముకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉండేవని, అలాంటిది గిరిజన విద్యార్థుల కోసం రాష్ట్రంలో 92 గిరిజన పాఠశాలలు ఏర్పాటు చేశామని, వాటిని జూనియర్ కళాశాలలుగా, డిగ్రీ కళాశాలలుగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ రవి నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు తాండాలన్ని గ్రామ పంచాయతీలలో విలీనమై ఉండేవని, అలాంటిది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని, దీని ద్వారా ఎంతో మంది గిరిజనులు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఇతర ప్రజా ప్రతినిధులుగా ఉన్నారన్నారు.
విద్యార్థులకు 5వ తరగతి నుండి పీజీ ఆపై చదువులు, మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులకు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల ద్వారా విద్యను అందిస్తున్నామని తెలిపారు. జిల్లా రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, పంచాయతీరాజ్ డిఈ విష్ణు, తహసీల్దార్ బక్క శ్రీనివాసులు, ఎంపీడీఓ ధనంజయ గౌడ్, టిఎంజిఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్ , మాజీ జడ్పిటిసి కరుణాకర్‌గౌడ్, కృష్ణయ్య, రామకృష్ణ, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.