Saturday, December 21, 2024

గిరిజన జీవితాల్లో వెలుగులు నింపిన రాష్ట్ర ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

గూడూరు : దేశంలోనే ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు, వినూత్న కార్యక్రమాలతో గిరిజన జీవితాల్లో వెలుగులు నింపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని గూడూరు మండలంలోని మారుమూల గ్రామమైన మట్టెవాడలో తెలంగాణ గిరిజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు మాలోతు కవిత, మహబూబాబాద్ శాసన సభ్యులు బానోతు శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్ కె.శశాంక పాల్గొన్నారు. గిరిజన ఉత్సవాన్ని పురస్కరించుకొని మట్టెవాడలో ర్యాలీ నిర్వహించారు. గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ప్రతీ ఒక్కరికి సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయని చెప్పారు. దశాబ్ధాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మగౌరవంతో బతికేలా చేసిన నాయకుడు సిఎం కెసిఆర్ అని చెప్పారు. గిరిజనుల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. ఆరుశాతం గిరిజనులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండగా పదిశాతం వరకు పెంచుకున్నామన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి పోడు పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.

గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్న సిఎం కెసిఆర్ : ఎమ్మెల్యే శంకర్‌నాయక్
గిరిజన సంక్షేమానికి సిఎం కెసిఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. తండాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీ హోదా కల్పించి బంజారాల చిరకాల వాంఛను నెరవేర్చారని దీని వలన తండాలను గిరిజనులే సర్పంచ్‌లు, వార్డు మెంబర్లుగా ఎన్నికై పాలించుకుంటున్నారని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బంజారాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మట్టేవాడ, హనుమ తండా, ఊట్ల గ్రామాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయని ఈ ప్రాంత ప్రజలకు పోడు పట్టాల పంపిణీ అనంతరం ఇండ్లను కూడా అందజేస్తామని చెప్పారు.

మారుమూల ఏజెన్సీ గిరిజన తండాలకు సముచిత గౌరవం : జిల్లా కలెక్టర్ శశాంక
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే మారుమూల ఏజెన్సీ గిరిజన తండాలు సముచిత గౌరవాన్ని అందుకున్నాయని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. మా తండాల్లో మా పరిపాలన అనే నినాదంతో 461 గ్రామ పంచాయతీలు ఏర్పడగా అందులో 280 తండా గ్రామ పంచాయతీలుగా ఉన్నాయన్నారు. ఈ పంచాయతీలు ఎక్కువగా 217 సర్పంచ్‌లు గిరిజనులే ఉన్నారని చెప్పారు. ఈ నెల 24వ తేదీ నుండి అటవీ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం చేపడుతామన్నారు. పోడు పట్టాలకు కూడా రైతుబంధు అమలు చేస్తామన్నారు. విద్యతోనే అభ్యున్నతి ఉంటుందన్నారు.

కుటుంబంలో ఒకరు విద్యను అభ్యసిస్తే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. చదువుతోనే ప్రతీ ఒక్కరి తలరాత మారుతుందని చెప్పారు. ఆర్టీసీ బస్సులోనే సురక్షిత ప్రయాణమని అన్నారు. ప్రజలు ఆర్టీసికి ఆదాయం వచ్చేలా బస్సులో ప్రయాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు ఎర్రయ్య, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, తహశీల్దార్ అశోక్, కుమార్, ఎంపీడీఓ రోజారాణి, సర్పంచ్ సంధ్య, ఎంపీటీసీ ప్రవళిక, అధికారులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News