ప్రముఖ కన్నడ నటుడు దేవరాజ్ తెలుగు చిత్రసీమ ప్రేక్షకులకూ సుపరిచితులే. ఆయన పెద్ద కుమారుడు, డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ కథానాయకుడిగా వర్థమాన్ ఫిల్మ్స్, లోటస్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ ప్రొడ్యూసర్ గోవర్థన్ రెడ్డి నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘జాతర’. ఈ సినిమాకు ఉదయ్ నందనవనమ్ దర్శకుడు.
ఆగస్టులో ‘జాతర’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు నిఖిల్ కథానాయకుడిగా ‘శంకరాభరణం’ తీసిన ఉదయ్ నందనవనమ్… ఈ సినిమా కోసం డిఫరెంట్ కాన్సెప్ట్ రెడీ చేశారు. అందమైన ప్రేమకథ రాశారు. కార్తీ ‘ఖైదీ’ తరహా నేపథ్యంలో ఆ ప్రేమకథతో రగ్గడ్ ఫిల్మ్ తీయనున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది.
చిత్ర నిర్మాత గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ ”ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభించి… ఈ ‘జాతర’ను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తాం. మంచి కథ కుదిరింది. దీనికి ప్రజ్వల్ దేవరాజ్ గారు అయితే కరెక్ట్ అని ఆయన్ను సంప్రదించాం. వెంటనే ఓకే చేశారు. దేవరాజ్ గారు కూడా మాకు అండగా ఉన్నారు. బి. వాసుదేవ్ రెడ్డి రాసిన కథకు ఉదయ్ నందనవనమ్ ఇచ్చిన ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే ‘జాతర’ స్క్రిప్ట్‌ను మరింత కొత్తగా మార్చింది. బళ్ళారి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం” అని చెప్పారు.
దర్శకుడు ఉదయ్ నందనవనమ్ మాట్లాడుతూ ”సినిమాలో ప్రేమకథ ఎంత అందంగా ఉంటుందో… నేపథ్యం కూడా అంతే కొత్తగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా కథ, కథనం ఉంటాయి. త్వరలో కథానాయిక వివరాలు వెల్లడిస్తాం” అని చెప్పారు.