Saturday, December 21, 2024

భగీరథ నీటితో రోగాలకు చెక్

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : మిషన్ భగీరధ నీటితో ప్రాణాంతక వ్యాధులను కట్టడి చేయవచ్చని  విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గా కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు సురక్షితమైన మంచినీటి సరఫరా జరుగుతుందని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇమాంపేట మిషన్ భగీరథ ప్లాంట్ ప్రాంగణంలో జరిగిన మంచి నీటి పండుగ సంబరాలలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమ్మడి మిషన్ భగీరథ అధికారి సురేష్ ఆధ్వర్యంలో ఆ శాఖ సిబ్బంది బోర్ నీటితో పాటు కొన్న నీటితో సంభవించే దుష్పరిణామాలు వివరించడంతో పాటు మిషన్ భగీరథ నీటితో ప్రాణాంతక వ్యాధులకు ఎలా అరికట్టవచ్చో అనేది సోదాహరణంగా వివరించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేటకు పాయాఖానా నీళ్లు తాపించిన ఘనత కాంగ్రెస్ పాలకులకు దక్కుతుందని ఎద్దేవాచేశారు. అటువంటి నేతలు కాలి యాత్రా, మోకాలి యాత్ర అంటూ మరోమారు ప్రజల్ని మోసం చేయడానికి ఓ దండు బయటుదేరిందన్నారు.

అటువంటి యాత్రలలో పాల్గొంటున్న నేతలు ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారని ఆయన నిలదీశారు. 2014కు మందు త్రాగు నీటి కోసం కుళాయిల వద్ద కోట్లాట, బిందెడు నీళ్ల కోసం తండ్లాట, గుక్కెడు నీటి కోసం ముష్టి ఘాతాలు, పోలీస్ స్టేషన్ పాలు, కేసులు కాంప్రమైజ్‌లంటూ వీధుల పాలైన సందర్భాలను ఆయన ఉటంకించారు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి బయటపడి సురక్షితమైన నీటితో అభివృద్ది, సంక్షోమంలో భాగస్వామ్యం అయిన ప్రజల్ని మోసం చేయడానికే ఆ యాత్రలు అంటూ ఆయన మండిపడ్డారు. మిషన్ భగీరథ నీటితోనే కాంగ్రెస్ పాలకులు పెంచి పోషించిన ఫ్లోరోసిస్ పాపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మటుమాయం చేశారని అన్నారు.

ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 917 కోట్లతో ఇంటింటికి సురక్షితమైన త్రాగు నీరు సరఫరా చేస్తుండగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 5102.39 వేల కోట్లతో 6లక్షల 94వేల 24 ఇండ్లకు త్రాగు నీటి సరఫరా కొనసాగుతుందన్నారు. అటువంటి అద్భుతాలను మరచిపోయిన కాంగ్రెస్ పార్టీ రేపోమాపో ఎన్నికలు వస్తున్నాయని ఉప్పు అందగానే తొమ్మిదేళ్లలో ఏమి చేశారంటూ విమర్శల దాడులకు పూనుకుంటున్నారని అన్నారు. అలా నోరు తెరిచిన గొంతుకలకు సమాధానం మూడి మీద కొట్టేలా ఉండాలి అంటూ ఘాటుగా విమర్శించారు.

జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్, జలసాధన ఉద్యమ నేత దుశ్చర్ల సత్యనారాయణ, మిషన్ భగీరథ అధికారి సురేష్, జడ్పి సీఈఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి, ఎంపిపి బీరవోలు రవీందర్ రెడ్డి, జడ్పిటిసి జీడి భిక్షం, సర్పంచ్ పాముల ఉపేందర్, ఎంపిటిసి మామిడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News