Monday, December 23, 2024

తెలంగాణకు హరితోత్సవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమమే కాకుండా భవిష్యత్తు తరాలకు మరేదైన చేద్దాం అనే ఆలోచన మదిలో మొదిలిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి రూపకల్పన చేశారు. భవిష్యత్తు తరాలకు ఈ భూగోళాన్ని పరిరక్షించడం, పర్యావరణ పరంగా సుస్థిర అభివృద్ధిని చేయడమే ఒక మార్గం . ఈ నేపథ్యంలో వాతావరణ సమతుల్యం ఉండాలంటే 33 శాతం పచ్చదనం తప్పనిసరి కానుంది. పెరుగుతున్న జనాభాతో అవసరాలు పెరిగి అటు అడవులు కనుమరుగు అవుతున్నాయి. దానితో వాతావరణంలో మార్పులు వచ్చి ఉష్ణోగ్రతలు పెరుగడంతో పాటు వర్షపాతం తగ్గి పోతోంది. దీనికొ తోడు అటు ఓజోన్ పొర క్షీణించిపోతుంది.

ఈ క్రమంలో వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని వాటి ప్రభావాలను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికతో ప్రతిష్టాత్మక తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి 2015లో శ్రీకారం చుట్టింది. తెలంగాణలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుండి 33 శాతం పెంచే లక్షంతో తెలంగాణ ప్రభుత్వం 2015-16లో తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. కేవలం ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రజలను, రైతులను భాగస్వాములను చేసి ఒక ప్రజా ఉద్యమంగా మలచి ముందుకు నడుపుతోంది. హరితహారంలో రాష్ట్రంలో మొత్తం 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్షంతో ముందుకు సాగుతోంది. చైనా, బ్రెజిల్ తర్వాత పచ్చదనాన్ని పెంచడంలో అతిపెద్ద మానవ ప్రయత్నంగా ఖ్యాతికెక్కింది. ఈ కార్యక్రమం చేపట్టడంలో పర్యావరణ సమతుల్యం కాపాడుకోవడంతో పాటు జీవనోపాధి కల్పన, మంచి వర్షపాతం నమోదు అవుతుంది.

ప్రతి గ్రామంలో చెట్ల పెంపకాన్ని తప్పని సరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసింది. ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి, మొక్కలను నాటి వాటిని రక్షించి, గ్రామంలో పచ్చదనాన్ని పెంచి, పరిశుభ్రతను కాపాడాలని ఆ చట్టంలో పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు హరిత రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. జీయో ట్యాగింగ్ మొక్కలను పర్యవేక్షించడ ం జరగుతోంది. పచ్చదనం పెంపొందించడంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ , బ్లాక్ ప్లాంటేషన్, సంస్థాగత ప్లాంటేషన్, హోమ్ స్టెడ్ ప్లాంటేషన్, ఆగ్రో ఫారెస్ట్రీ ప్లాంటేషన్ పేరిట మొక్కలు పెద్ద సంఖ్యలో నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇటీవల సవరించిన పంచాయతీరాజ్ చట్టం 2018, మున్సిపల్ చట్టం 2019లో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌గా కేటాయించి, పచ్చదనాన్ని విస్తరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 273 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. 2015-16లో తెలంగాణలో అటవీ విస్తీర్ణం 19.854 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2023 నాటికి అది 26, 969 చదరపు కిలో మీటర్లకు పెరిగింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం పెరిగింది. గతంలో పట్టణాలు, నగరాల్లో పచ్చదనం కరువై, ఉద్యానవనాలు లేక ప్రజలు ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక నర్సరీతో పాటు 19,472 పల్లె ప్రకృతి వనాలు , 2,275 భృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. అటు రహదారులకు ఇరువైపులా మొక్కలను పెద్ద సంఖ్యలో పెంచడం జరుగుతోంది. పట్టణాలలో 700 కోట్ల రూపాయల వ్యయంతో 179 చోట్ల అర్బన్ ఫారెస్ట్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో హరిత నిధిని ఏర్పాటు చేసింది. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ హరితనిధిలో భాగస్వాములే. కాగా వీరందరి నుంచి సేకరించిన మొత్తంలో హరితనిధి ఏర్పాటు అయ్యింది. దీంతో హరితనిధికి నోడల్ ఏజెన్సీగా అటవీశాఖ వ్యవహరిస్తోంది.

ప్రభుత్వ సంకల్పానికి ప్రజల సహకారం తోడవడంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతోంద. సుమారు ఒక లక్ష కిలో మీటర్ల మేర రాష్ట్ర వ్యాప్తంగా రహదారి వనాలను ( అవెన్యూ ప్లాంటేషన్) ఏర్పాటు చేయడం జరిగింది. 13.44 లక్షల ఎకరాల క్షీణించిన అడవులను పునరుద్ధరణ చేయడం జరుగుతోంది. అటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు జూన్ 19న తెలంగాణ హరితోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో 9వ విడత హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంను అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ తొమ్మిదో విడతలో భాగంగా 19.29 కోట్ల మొక్కలను నాటాలని లక్షాన్ని నిర్దేశించారు. ఈ ఏడాది అన్ని సాగునీటి ప్రాజెక్టుల స్థలాల, కాలువల వెంట పచ్చదనం పెంచాలనే నిర్ణయం తీసుకోవడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News