రాజకీయ భవిష్యత్తు రూపకల్పన కోసం ఆప్ సభ్యత్వం స్వీకరించండి
ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాత్రమే ఆచరణీయమైన ప్రత్యామ్నాయమని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి సుధాకర్ అన్నారు. ప్రజలకు ఉచితంగా మంచి విద్య, మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు, విద్యుత్, అవినీతి రహిత పాలన అందిస్తున్న ఆప్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఆప్ సభ్యత్వం పొంది రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్, లిబర్టీ ఆప్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ‘మిస్డ్ కాల్ తో ఆప్ సభ్యత్వ నమోదు‘ పోస్టర్ ను ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఎండి. మజీద్, డా. పుట్ట పాండు రంగయ్య, డా. సోలొమన్ రాజు, సుభాష్ రాథోడ్, బాబుల్ రెడ్డి, ప్రొఫెషనల్ కమిటీ కన్వీనర్ డా. జి. హరి చరణ్ లతోకలసి డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆవిష్కరించి సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మొబైల్ నంబర్ 8080028080 కి మిస్డ్ కాల్ ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ క్రియాశీల సభ్యత్వం పొందవచ్చునని తెలిపారు. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండి పార్టీలో సభ్యత్వం పొందేందుకు అర్హులని పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రజల జీవితాల్లో ఆప్ చేసిన మార్పును చూసి తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తి చూపడం ప్రారంభించారని, అపూర్వ స్పందన వస్తోందని అయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల ఆప్ సభ్యత్వ డ్రైవ్‌లో రెండు లక్షల మంది కొత్త సభ్యులను చేర్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, నెల రోజుల పాటు జరిగే సభ్యత్వ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, ప్రతి పట్టణం, గ్రామం సందర్శించి మిస్డ్ కాల్ ఇచ్చిన పౌరులనుండి సభ్యత్వం తీసుకుంటారని అయన తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తెలంగాణాలో బలమైన సంస్థాగత నిర్మాణాన్ని నిర్మించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. త్వరలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాద్యులను నియమించి, బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేస్తామని డా. సుధాకర్ వెల్లడించారు.
బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీల నియంతృత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని, విద్య, వైద్యం, శాంతిభద్రతలు, సామాజిక న్యాయం వంటి రంగాలు క్షీణించాయని, నిరుద్యోగం అమాంతంగా పెరగడం, యువత, మహిళలు ఉపాధి అవకాశాల కోసం వెతుక్కోవలసిన దౌర్బాగ్యం ఏర్పడిందని విమర్శించారు. బిసి బంధు ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రతి బిసి కుటుంబానికి రూ. పది లక్షలు ఇవ్వాలని అయన డిమాండ్ చేసారు. నిజాయితీతో కూడిన పాలన కావాలని కోరుకునేవారంతా ఆప్ సభ్యత్వం పొంది పార్టీలో భాగం కావాలని సామజిక తెలంగాణ సృష్టించడం కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డాక్టర్ సుధాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు టి. రాకేష్ సింగ్, జావేద్, సూర్య, ఆర్. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.