Monday, December 23, 2024

హైదరాబాద్ టు విజయవాడ బస్సుల్లో డైనమిక్ టికెటింగ్ విధానం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ టు విజయవాడల మధ్య నడిచే బస్సుల్లో డైనమిక్ టికెటింగ్ విధానం అమలు చేయాలని ఆర్టీసి నిర్ణయించినట్టుగా తెలిసింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ నగరాల నుంచి బెంగళూరుకు నడిపే బస్సుల్లో ఆర్టీసి డైనమిక్ టికెటింగ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టు కింద మార్చి 27వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో కంటే డైనమిక్ విధానంతో ఆదాయం 15 శాతం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో విజయవాడ మార్గంలోనూ ఈ విధానాన్ని అమలుచేసేందుకు టిఎస్ ఆర్టీసి అధికారులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే హైదరాబాద్ -టు విజయవాడల మధ్య నడిచే బస్సుల్లో ఈ టికెటింగ్ విధానం అమల్లోకి రానుంది. డైనమిక్ టికెటింగ్ విధానంలో టికెట్లు బుక్ అయ్యే కొద్ది మిగిలిన సీట్ల ధరలు పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం విమానాల్లో ఈ తరహా విధానం అమల్లో ఉంది.

తొలి విడతగా 100 బస్సుల్లో ఈ విధానం
హైదరాబాద్ టు- విజయవాడ మధ్య నిత్యం 132 బస్సుల్లో ముందుస్తు రిజర్వేషన్ సదుపాయం ఉండగా, ఇందులో తొలి విడతలో 100 బస్సుల్లో డైనమిక్ టికెటింగ్ విధానాన్ని అమలు చేసేందుకు ఆర్టీసి సిద్ధమవుతోంది. ఈ కొత్త విధానం వారం రోజుల్లో అమల్లోకి రానున్నట్లుగా సమాచారం. ఈ విధానంలో స్లీపర్ బస్సుల్లో లోయర్ బెర్తులకు అధిక టికెట్ ధరలను వసూలు చేయనున్నారు. సీటింగ్ మాత్రమే ఉండే ఈ సర్వీసుల్లో డ్రైవర్ వెనుక తొలి వరుస సీట్లు బస్సుల్లో చివరి రెండు వరుసలు మినహా మిగిలిన అన్ని సీట్లకు టికెట్ ఛార్జీలు అధికంగా ఉండే అవకాశముంది. ప్రస్తుతం హైదరాబాద్ టు విజయవాడల మధ్య సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ. 570 ఛార్జీలను వసూలు చేస్తున్నారు. లహరి స్లీపర్ రూ. 750లు, రాజధాని రూ. 710లు, గరుడ ప్లస్ రూ. 830లు, ఎలక్ట్రిక్ గరుడ రూ. 740లు, స్లీపర్ రూ. 1,050లను ఆర్టీసి వసూలు చేస్తోంది.

టికెట్ ధరలపై ఆర్టీసి అదనంగా 25 శాతం చార్జీలు
ఈ విధానం అమల్లోకి వస్తే ఇప్పుడున్న టికెట్ ధరలపై ఆర్టీసి అదనంగా 25 శాతం చార్జీలను వసూలు చేయనుంది. సర్వీసుల వారీగా డిమాండ్‌తో పాటు ఆ సమయంలో ప్రైవేటు ఆపరేటర్లు నిర్ణయించే టికెట్ల ధరలను అంచనావేస్తూ ఆర్టీసి బస్సుల్లో టికెట్ల ధరలను నిర్ణయించాలని అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్టుగా తెలిసింది. ఈ విధానం అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు చేసే వారికి మరింత భారం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News