Friday, December 20, 2024

అపర భగీరథుడు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మరిపెడ : మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షిత మంచినీటిని అందిస్తున్న అపర భగీరథుడు సిఎం కెసిఆర్ అని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెంలోని ఎదళ్లగుట్ట వద్ద గల మిషన్ భగీరథ ప్లాంట్ వద్ద తెలంగాణ మంచినీటి దినోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంచినీటి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత, జడ్‌పి చైర్‌పర్సన్ కుమారి ఆంగోతు బిందు, స్ధానిక ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా మిషన్ భగీరథ ప్లాంట్‌ను సందర్శించి అక్కడే మిషన్ భగీరథ మంచి నీటిని తాగారు.

జిల్లాలోని ప్రజాప్రతినిథులకు మిషన్ భగీరథ పథకం పనితీరును ప్రత్యేక్షంగా తిలకించేందుకుగానూ, తాగునీటిపై నెలకొన్న అపోహలను తొలగించేందుకుగానూ మండలానికి రెండు బస్సులు చొప్పున జిల్లా కేంద్రంలోని 16 మండలాలకు 32 బస్సులతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి మరో 12 బస్సులు మొత్తం 44 బస్సులను ఏర్పాటు చేసి సురక్షిత తాగునీటిపై విస్తృత ప్రచారం చేపట్టి అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె. శశాంక అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాలు, తండాలకు సంమృద్ధిగా నీరు అందించడంతో తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరాయని తెలిపారు. సిఎం కెసిఆర్ ఎంతో నమ్మకముంచి తనకు ఇచ్చిన పంచాయితీరాజ్ శాఖను అద్భుతంగా తీర్చిదిద్దానని అందుకు ఉదహరణ మూడు అవార్డులు పొందానని తెలిపారు. తాను మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో చేసిన పనులకు దేశంలో ఉన్నతంలో నిలిచి మూడు అవార్డు పొందడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ నీరు అందించడంతో దేశంలోనే ఫ్లోరైడ్ లేని రాష్ట్రంగానూ రెండవ అవార్డుగా ఇంటింటికి తాగునీరు అందించే పథకంకు, మూడో అవార్డు ఓడిఎఫ్ సాధించినందుకు అని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరూ ముందుగా సమీక్షించుకోవాలన్నారు. ఈ శాఖకు మంత్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని తెలిపారు. నేను నా గ్రామం పర్వగిరిలో శుద్ధి చేసిన మిషన్ భగీరథ జలాలని తాగుతున్నానని, నా ఆరోగ్యం బాగున్నదని మీరు కూడా మిషన భగీరథ జలాలలనే తాగాలని తెలిపారు. మిషన్ భగీరథ రాక ముందు ప్రజల ఆరోగ్యాన్ని పరిగణనలోనికి తీసుకొని తన ట్రస్ట్ ద్వారా 250 మినరల్ వాటర్ ప్లాంట్స్ నెలకొల్పానని మిషన్ భగీరథ పథకం నిర్మించిన తర్వాత వాటిని మూసి వేయడం జరిగిందన్నారు.

తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూపుతుందని, తెలంగాణ రాష్ట్రానికి నయా పైసాకూడా ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రాకతో కాలేశ్వం ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలు ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా చెరువులు నింపడంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ప్రతి బోరు వద్ద ట్యాంక్ నిర్మించి తాగునీరు అందించడం సామాన్యమైన విషయమేనని కానీ జాలాలను శుద్ధి చేసి సురక్షితమైన తాగునీరు అందించడం గొప్ప విషయమని తెలిపారు. గతంలో గ్రామ పంచాయితీకి అందించే నిధులు తాగునీటి పథకాలకు మోటర్ల మరమ్మత్తులకు, పైపులైన్లకు, విద్యుత్ బిల్లులకు మాత్రమే సరిపోయేవని వేసవిలో గ్రామాలలో అడుగు పెట్టాలంటేనే భయం వేసేదని పోలీసు శాఖ సహకారం తీసుకుని వెళ్లే వారం అని సమ్మర్ యాక్షన్ ప్లాన్లు రూపొందించుకోవడం బహు కష్టంగా మారేదని, నా అక్క చెల్లల్లు తెల్లవారకముందే మంచినీటి పంపుల వద్ద బిందెలతో లైన్లలో గంటల తరబడి నిలబడటం తన మనసు కలిసి వేసిందన్నారు.

తెలంగాణ రాకతో మిషన్ భగీరథ నీటిని ఇంటింటికి అందిస్తూ మహిళల కష్టాలకు చెక్ పెట్టామన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేయడమే లక్షంగా సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించన పథకమే మిషన్ భగీరథ అన్నారు. ఎండాకాలం వచ్చిందంటే కిలోమీటర్లు నడిచి వ్యవసాయ బావులు, ఏరుల వద్దకు క్యాన్లు, బిందెల్లో నీళ్లు తెచ్చుకున్న పరిస్ధితి అన్నారు. ఎటుచూసిన ఎండిన బోర్లు, బావులు శిథిలావస్ధలో ఉన్న ట్యాంకులే కనిపించేవన్నారు. నేను కూడా గతంలో నెత్తిన బిందెలు ఎత్తుకుని నీటిని తెచ్చుకున్నానని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా నేడు ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందుతుందన్నారు. దీనితో సిఎం కెసిఆర్ స్వప్నం సాకారమైందన్నారు. కాంగ్రెస్, బిజెపి పాలనలో అభివృద్ధి జరుగలేదని, సిఎం కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు.

ప్రజలకు వంద శాతం సురక్షిత తాగునీటిని అందజేస్తున్న అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాన దేశంలోనే తొలిస్ధానంలో నిలిచిందన్నారు. ఖనిజ లవణాలు లేని నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, మిషన్ భగీరథ మంచినీటి నాణ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె. శాశాంక, ఎంపి మాలోతు కవిత, జడ్‌పి చైర్‌పర్సన్ కుమారి ఆంగోతు బిందు, ఎమ్మెల్యేలు డిఎస్ రెడ్యానాయక్, బానోతు శంకర్‌నాయక్‌లు మాట్లాడుతూ దప్పిక ఉందని దూప అవుతుందని మంచినీళ్ల కోసం అల్లాడిపోయే వాళ్లమన్నారు. బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూం వెళ్లి తెచ్చుకునే పరిస్ధితి ఆనాడు ఉండేదని తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతూ మంచినీటి కొరతకు శాశ్వతంగా చరమగీతం పాడిందన్నారు.

తాగేనీటిపై తెలంగాణ ప్రభుత్వం కల్పించిన నమ్మకం ప్రతి ఒక్కరూ గుర్తిస్తూ మరో పది మందికి చేప్పే బాధ్యతగా కూడా భుజస్కందాలపై వేసుకోవాలన్నారు. ఒక్క నీటి చుక్క కోట్ల రూపాయలు పెట్టిన కొనలేమని నేడు ప్రతి ఇంటికి గడప తట్టింది అంటే ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వానికి చెల్లుతుందని తెలిపారు. శుద్ధిచేసిన మిషన్ భగీరథ నీటిని ప్రతి ఒక్కరూ తాగి ఆరోగ్య తెలంగాణలో భాగస్వాములు కావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్‌పి చైర్‌పర్సన్ ఆంగోతు బిందు, ఎంపి మాలోతు కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు, మరిపెడ ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు సింధూర రవినాయక్, మిషన్ భగీరథ ఎస్‌ఈ రాములు, అధికారులు సురేందర్‌రెడ్డి, అనూష, రాకేష్, ప్రదీప్, ఆయా మండలాల ఎంపిపిలు, జడ్‌పిటిసిలు, మున్సిపల్ చైర్‌పర్సన్స్, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, మిషన్ భగీరథ అధికారలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News