హైదరాబాద్ : నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో గిరిజన విద్యార్థులు సత్తాచాటారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. ఈ ఏడాది ఐఐటీ అడ్వానస్డ్ ఫలితాల్లో గిరిజన విద్యార్థులు డైరెక్ట్ కేటగిరీలో 101 మంది ప్రిపరేటరీ కేటగిరీలో 118 మంది విద్యార్థులు ఈ ఏడాది ప్రీమియర్ టెక్నలాజికల్ యూనివర్శిటీల ఐఐటీల్లో సీట్లు సాధించడం ఖాయమని మంత్రి అన్నారు. గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ నుండి, 350 మంది విద్యార్ళులకు ఐఐటి, జెఈఈ అడ్వానస్డ్ – 2023 క్రాకింగ్ కోసం ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వటం జరిగిందని మంత్రి తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా వందలోపు ర్యాంకులు సాధించి గిరిజన విద్యార్థులు వారి ప్రతిభ కనబరిచడం హర్షణీయమని మంత్రి అన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజన విద్యార్దుల సంక్షేమానికి అధిక ప్రాదాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయనడానికి విద్యార్థులు సాధిస్తున్న ఈ ర్యాంకులే నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యార్థుల వలసలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
గురుకులాల్లో నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో గిరిజన విద్యార్ధులకు ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటి పరీక్షలకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నారని, పివిటిజిఎస్ విద్యార్థులు సైతం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఇంజనీరింగ్ , ఎంబిబిఎస్ విద్యలో ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. రికార్డు స్ధాయిలో గిరిజన విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించి, సత్తాచాటాడానికి కృషి చేసిన అధికారులను సిబ్బందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.