Monday, November 25, 2024

సిఎంకు జవహర్‌నగర్ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారు

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్: మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్నామని, ఈ విషయంలో సిఎం కెసిఆర్‌కు జవహర్‌నగర్ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం జవహర్‌నగర్‌లో మెట్రో వాటర్ వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన మంచినీళ్ల పండుగ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు జవహర్‌నగర్‌లో మంచినీటి కోసం మహిళలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాని నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఏర్పడిన మిషన్ భగీరథ పథకంతో తెలంగాణ అంతట ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు.

జవహర్‌నగర్ చు ట్టు రిజర్వాయర్, పైప్‌లైన్లు ఉన్నాయని, తాగటానికి ఎండకాలంలో కూడా ఇబ్బందులు ఉండవన్నారు. ఒకప్పుడు మురికివాడగా ఉన్న జవహర్‌నగర్‌లో నేడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, బాలాజీనగర్ ప్రధాన రహదారి డబుల్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి, స్ట్రీట్‌లైట్లతో రూపురేఖలు మారనున్నాయన్నారు. ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇప్పించే బాధ్యత నాదేనని, మనమందరం కలిసికట్టుగా ఉండి అభివృద్ధి దిశగా ముందుకు సాగలన్నారు.

జవహర్‌నగర్ కార్పొరేషన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని, ప్రతి అసెంబ్ల్లీ సమావేశాలలో జవహర్‌నగర్‌లో నెలకొన్న సమస్యలను సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. జవహర్‌నగర్‌లో అత్యధికంగా పేద ప్రజలే నివసిస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలన్నారు.
1000మంది మహిళలతో మంచినీటి బిందెలు, బోనాలతో మహార్యాలీ
అంతకుముందు మహిళలు మంత్రి మల్లారెడ్డి, మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులతో కలిసి బాలాజీనగర్ ప్రధాన రహదారి గుం డా బోనాలు, మంచినీటి బిందెలతో మహార్యాలీ నిర్వహించి, బతుకమ్మ మైదానంలో నిర్వహించిన సభలో పాల్గొని సీఎం కెసిఆర్ చిత్రపటానికి నీళ్లతో అభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.రామలింగం, జలమండలి రెవెన్యూ డైరెక్టర్ విఎల్ ప్రవీన్‌కుమార్, సిజిఎం ఆనంద్‌నాయక్, జిఎం,శ్రీనివాస్‌రెడ్డి, డిజిఎంలు సాయినాథ్‌గౌడ్, త్రీనాథ్‌రావు, మేనేజర్లు కౌశిక్, శ్రీనివాస్, సంజీవ్‌రెడ్డి, మున్సిపల్ ఆర్‌వో ప్రభాకర్‌యాదవ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News