దుగ్గొండి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందచేస్తున్న న్యూట్రిషన్ కిట్ల వాడకం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంతో పాటు క్షేమంగా ఉంటారని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో సోమవారం గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లను వైద్యాధికారి డాక్టర్ కిరణ్‌రాజ్ ఆధ్వర్యంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాష్, ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య అందచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ.. న్యూట్రిషన్ కిట్ల వల్ల శిశు మరణాలు తగ్గించవచ్చన్నారు. 16 నుంచి 24 వారాలు నిండిన గర్భిణీలు మొదటగా పీహెచ్‌సీలో 28 వారాలు నిండిన గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లను అందిస్తారన్నారు.
ఈ కిట్‌లో కిలో కర్జూర పండ్లు, ఒక కిలో న్యూట్రిషన్ పొడి, 3 ఐరన్ టానిక్‌లు, అరకిలో ఆవు నెయ్యి, పల్లి పట్టీలు మొత్తం రూ. రెండు వేల విలువ ఉంటుందన్నారు. వీటిని గర్భిణీలు మాత్రమే తినాలన్నారు. అనంతరం హరితోత్సవంలో భాగంగా పీహెచ్‌సీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణప్రసాద్, పీఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రాజు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సలోని, ఉపసర్పంచ్ యాదగిరి సుధాకర్, స్టాఫ్ నర్సు సబిత, ఆసుపత్రి సిబ్బంది సాంబయ్య, వాణి, రవీందర్, రహమాన్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.