27 నుండి ‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’ కార్యక్రమం
21న యోగా డే ను విజయవంతం చేయండి
బీజేపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ లో బండి సంజయ్
హైదరాబాద్: ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఈనెల 22న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు ప్రతి ఒక్కరూ తమ పోలింగ్ పరిధిలో 100 ఇండ్లకు వెళ్లి సంచలనం సృష్టించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం శక్తి కేంద్రాల వారీగా సమావేశం నిర్వహించి ఎవరెవరు ఏ గల్లీలో తిరిగి ప్రజలను కలవాలనే అంశంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
ప్రతి కార్యకర్త ఏ ఇంటికి వెళ్లినా ఆ ఇంటికీ నరేంద్రమోదీ పాలనా విజయాలు, ప్రజలకు చేసిన మేలుపై ప్రచురించిన కరపత్రాలను పంచడంతో పాటు 90909024 నెంబర్ కు డయల్ చేసి మిస్డ్ కాల్ ఇచ్చేలా చూడాలని కోరారు. ఈనెల 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా యోగా డే కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.
పోలింగ్ బూత్ ను శక్తివంతం చేయడమే లక్ష్యంగా ‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’ పేరిట ఈనెల 27 నుండి జూలై 5 వరకు కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. అందులో భాగంగా ఈనెల 27న కార్యకర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారని తెలిపారు. మేరా బూత్ సబ్ సే మజ్బూత్ లో భాగంగా పార్లమెంట్ కు 10 మంది చొప్పున తెలంగాణ నుండి 170 మందిని ఎంపిక చేశామన్నారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోలింగ్ బూత్ కమిటీలపై బలోపేతంపై దృష్టి సారిస్తారని చెప్పారు. తెలంగాణకు సైతం ఇతర రాష్ట్రాల నుండి దాదాపు 900 మంది కార్యకర్తలు ఈనెల 27న వస్తున్నారని, వీరంతా వారం రోజులపాటు ప్రతి శక్తి కేంద్రంలో పర్యటించబోతున్నట్లు తెలిపారు.