సూర్యాపేట : 70ఏళ్ల పరాయిపాలనలో ధ్వంసమైన పర్యావరణానికి తెలంగాణ హరితహారం గొప్ప వరమని రాష్త్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో తెలంగాణ హరితహారం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గం నాగరం మండలం ఈటూరు గరామంలో హరితోత్సవం వేడుకలలో స్థానిక శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్‌తో కలసి పాల్గొని మొక్కలు నాటి, అటవీ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ ఎస్ వెంకట్రావ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014కు ముందు అటవీశాఖ కే పరిమితమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని పట్టించుకునే నాథుడే లేడన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ఉద్యమం నడిపించిన తీరుగానే హరిత ఉద్యమం నిర్వహించి, తాను నమ్మిన ప్రకృతి పునరుజ్జీవనాన్ని తెలంగాణ సమాజంలోని ప్రతి ఒక్కరి మదికి ఎక్కేలా చేయడంలో సీఎం కేసీఆర్ పాత్ర కీలకమన్నారు. దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం నేడు పచ్చని పంటలతో, మైదాన ప్రాంతం నిండుగా దట్టమైన చెట్లతో చూడముచ్చటగా ఉన్నది అంటే ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం వల్లె సాధ్యమైందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రజల బ్రతుకు చిత్రాన్ని మార్చడమే కాదు, ధ్వంసమైన అడవులను పునరుద్దరించడం, సకల జీవరాశులను సంరక్షించడం అని యావత్ దేశానికి సగర్వంగా చాటిచెప్పిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.
అతి తక్కువ కాలంలో దేశంలో అత్యధిక గ్రీన్ రివెల్యూషన్ సాధించిన రాష్త్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో సూర్యాపేట జిల్లాలో 7కోట్ల 50లక్షల మొక్కలు నాటగా, రాష్త్ర వ్యాప్తంగా నాటిన 273.33 కోట్ల మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్‌తో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయన్నారు. 9వ విడతలో భాగంగా ఈ ఒక్క రోజు 2లక్షల మొక్కలు నాటుతుండగా, వర్షాలు పడిన అనంతరం హరిత హారం కార్యక్రమాన్ని వేగవంతం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. హరిత తెలంగాణ సాధనలో 9ఏళ్ల కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షి అని అన్నారు. భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, మంచి వాతావరణం అన్న మంత్రి ఆకుపచ్చ తెలంగాణ కొరకు జరుగుతున్న ఉద్యమంలో పాఠశాల విద్యార్ధుల నుంచి వయో వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యకరమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, డిసిఎంఎస్ ఛైర్మన్ వట్టె జానయ్య యాదవ్, మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ ఛైర్మన్ పుట్ట కిషోర్, మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ వట్టె రేణుక జానయ్య యాదవ్, పట్టణ బిఆర్‌ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎండి చాంద్ పాషా, 13వ వార్డు అధ్యక్షులు షేక్ రఫీ, ఉపాధ్యక్షులు బానోత్ జానూ నాయక్, బీసీ సెల్ అధ్యక్షులు రాగం లింగయ్య, బూర కిరణ్ గౌడ్, జక్కలి సైదులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.