Saturday, November 23, 2024

అమెరికాలో కాల్పుల కలకలం..ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికాలో వారాంతపు రోజులు తుపాకీ కాల్పులతో దద్దరిల్లి పెన్సిల్వేనియా ప్రభుత్వ సైనికుడితో సహా దాదాపు ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాయి. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. తుపాకీ సంస్కృతి పెచ్చరిల్లి గత కొన్నేళ్లుగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు సబర్బన్ చికాగో, వాషింగ్టన్ స్టేట్, సెంట్రల్ పెన్సిల్వేనియా, సెయింట్ లూయిస్, సదర్న్ కాలిఫోర్నియా, బాల్టిమోర్ ప్రాంతాల్లో వేర్వేరు సంఘటనల్లో కాల్పుల వల్ల మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సౌత్‌వెస్ట్ చికాగోకు 20 మైళ్ల దూరంలో ఇల్లినాయీస్ రాష్ట్రం లోని విలోబ్రూక్‌లో ఆదివారం ఉదయం ఓ భవన పార్కింగ్ ప్రదేశంలో జూన్ టీన్త్ వేడుకల్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. ఈ హింస అత్యంత విషాదకరమని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపింది.

దాడికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు ఇల్లినాయిస్ గవర్నర్ జెబి ప్రిట్జెకర్ పేర్కొన్నారు. వాషింగ్టన్ స్టేట్ క్యాంప్ గ్రౌండ్‌లో ఆగంతకుడు యాధృచ్ఛికంగా కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. శనివారం రాత్రి చాలా మంది సంగీతోత్సవానికి సమీపాన చాలా మంది ఉండగా ఈ కాల్పులు జరిగాయి. ఈ సంగీతోత్సవం ఆదివారం ఉదయం వరకు జరిగింది. కాలిఫోర్నియా లోని కార్సన్‌లో ఓ ఇంటివద్ద పూల్ పార్టీ జరుగుతుండగా కాల్పులు సంభవించి ఎనిమిది మంది గాయపడ్డారు. బాధితులంతా 16 నుంచి 24 ఏళ్ల లోపు వారే. జార్జి నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు.

పెన్సిల్వేనియా లోని వాకర్ టౌన్‌షిప్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ప్రభుత్వ సైనికుడు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటనలో నిందితుడు తన ట్రక్కుని డ్రైవ్ చేసుకుంటూ లూయిస్‌టౌన్ బారక్స్ వైపు రాత్రి 11 గంటల సమయంలో దూసుకు వచ్చి అక్కడ ఉన్నవారిపై కాల్పులు జరిపి పారిపోయాడు. బాల్టిమోర్‌లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు. వీరంతా ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News