కేదార్‌నాథ్ : స్థానిక స్వయంభూ శివలింగంపై ఓ నడి వయస్సు మహిళ నోట్లు వెదజల్లారు. ఆలయంలోని గర్భగుడిలో నిలబడి తెల్లటి చీర జాకెట్టు, మెడలో రుద్రాక్ష మాలతో ఉన్న ఈ స్త్రీ అదేపనిగా కరెన్సీ విసరడం వివాదాస్పదం అయింది. ఈ మహిళ చేష్ట ఇప్పుడు వీడియో రూపంలో వైరల్ అయింది. హిందూ పురాణాల ప్రకారం శివభగవానుడు ఆదిభిక్షువు. శివుడిని భక్తి ప్రేమ భావనలతో బిల్వ పత్రాలు, పాలు పండ్లతోనే అర్చించాల్సి ఉంటుంది. అయితే భక్తులు దేవుడి పట్ల తమ విశ్వాసాన్ని చాటుకునేందుకు పలు పద్ధతులు పాటిస్తారు. కానీ కరెన్సీ నోట్లు విసిరి శివుడికి ఈ విధంగా పూజలు చేయడం ఇదే తొలిసారి అయింది.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయంలో జరిగిన ఈ ఘటనపై అధికారులు స్పందించారు. ఈ మహిళపై చర్యల విషయం పరిశీలిస్తున్నారు. శివుడిపట్ల ఇంతటి వెకిలీ చేష్టలా? అని పౌరులు మండిపడుతున్నారు. దేవాలయ అధికారులు ఈ విషయంపై తీవ్రంగా స్పందించి వెంటనే ఆమెపై చర్యలకు డిమాండ్ చేశారు. ఇది అత్యంత ప్రసిద్ధమైన పరమ పవిత్ర ఆచారాలతో కూడిన కేదార్‌నాథ్ శివాలయం అని, ఇక్కడికి వచ్చి ఏదో బార్‌లో నోట్లు విసురుతున్నట్లుగా ఆమె వ్యవహరించడం ఏమిటని , ఎక్కడున్నా చర్యకు గురి కావాల్సిందే అని ఆలయ ధర్మకర్తల మండలి స్పష్టం చేస్తోంది.