తిరుపతిఐఫ:అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో గల శ్రీ చెన్నకేశవస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 29 నుండి జూలై 7వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు జూన్ 28వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు.
జూన్ 29న ఉదయం 9 నుండి 10 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి శేషవాహన సేవ నిర్వహిస్తారు. జూన్ 30, జూలై 1, 2, 3వ తేదీల్లో ఉదయం పల్లకీ సేవ నిర్వహిస్తారు.
జూన్ 30న రాత్రి హంస వాహనం, జూలై 1న రాత్రి సింహ వాహనం, జూలై 2న రాత్రి హనుమంత వాహనం, జూలై 3న రాత్రి గరుడవాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు.
జూలై 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300 చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 8.30 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు.
జూలై 5న సాయంత్రం 6 గంటలకు రథోత్సవం, జూలై 6న రాత్రి అశ్వవాహనం, జూలై 7న ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జూలై 8న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహన సేవలు నిర్వహిస్తారు.