న్యూఢిల్లీ: చైనా వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టెన్నిస్ జట్టును ప్రకటించారు. చైనాలోని హాంగ్జౌ నగరంలో సెప్టెంబర్ 23 నుంచి ఈ పోటీలు జరుగనున్నాయి. కాగా, ఆసియా క్రీడల కోసం ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఎఐటిఎ) 12 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది.
డబుల్ స్పెషలిస్ట్, సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న కూడా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో అంకిత రైనాతో కలిసి బరిలోకి దిగనున్నాడు. కిందటి ఆసియా క్రీడల్లో అంకిత రైనా మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించింది.
ఇక పురుషుల టీమ్‌లో సుమిత్ నగాల్, శశికుమార్ ముకుంద, యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేనితో పాటు రోహన్ బోపన్నకు చోటు దక్కింది. మహిళల టీమ్‌లో అంకిత రైనాతో పాటు కర్మాన్ కౌర్, రుతురాజ్ భోస్లే, సహాజ యమ్లాపల్లి, వైదేహి, ప్రతానె థోంబారేలు చోటు సంపాదించారు. ఈ వివరాలను ఎఐటిఎ మంగళవారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.