Friday, November 22, 2024

గతంలోనే హిందూత్వ భవిష్యత్తు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ హిందూ రాజకీయాలను విశ్లేషిస్తుంటారు. భారత దేశ బహుళత్వం గురించి తరచూ ఆమె గొంతెత్తుతుంటారు. అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే ఆమెపై మతవాదులు కూడా తరచూ విరుచుకుపడుతుంటారు. ఆమె తాజా పుస్తకం ‘ద ఫ్యూచర్ ఇం ద పాస్ట్’ వ్యాస సంకలనంలో చరిత్రకారిణిగా గుర్తింపు పొందిన ఆమె అభిప్రాయాలు, సమస్యలు చోటు చేసుకున్నాయి. గతించిన హిందూత్వ కాలం నుంచి ప్రస్తుత హిందూ రాజకీయాలు ఎలా చట్టబద్ధతను ఆశిస్తున్నాయో రొమిల్లా థాపర్ వివరించారు.

ప్రశ్న: చరిత్రపై హిందూత్వ ధోరణిని మీరెలా చూస్తారు?
రొమిల్లా: సహజంగా సంజాయిషీ ఇచ్చే సిద్ధాంతాలతో చరిత్రను చూసే విధానం ముడిపడి ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, ఒక అంశంపైన పరిశోధించి, సాధించిన విశ్వసనీయ సాక్ష్యాలను సేకరించి, వాటిని విశ్లేషించి, గతానికి సంబంధించిన సంఘటనలపై తర్కబ్ధమైన వివరణను ఇవ్వడం అవసరం. హిందుత్వ ధోరణికి మాత్రం గతానికి సంబంధించిన వర్ణనలను తయారు చేసి, చరిత్రలో దానికొక చట్టబద్ధతను తీసుకురావడానికి పైవేమీ అవసరం లేదు. వీరు సేకరించిన సాక్ష్యాలు విశ్వసనీయమైనవా, కావా, వాటిని సరైన విధంగా తర్కించి చూశారా అన్న పరిశీలన దానికి అవసరం లేదు. నిజమైన చరిత్రకారులు వీటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. హిందూ రాష్ర్టం ఏర్పాటు కోసం గతానికి సంబంధించిన ఊహాజనిత విషయాలతో హిందూ చరిత్రను రూపొందించడం వారి ఉద్దేశం. ఇతరులతో పోల్చుతూ హిందూ ఆలోచనా చరిత్రపైన దృష్టి సారిస్తారు. చరిత్ర పుస్తకాల్లో ఇటీవల తొలగించిన మొగలుల చరిత్ర అలాంటిదే. వివిధ మార్గాల నుంచి వచ్చిన విషయాలు గతానికి తోడవుతుండగా, హిందూత్వానికి మాత్రం హిందూ వర్గాలకు సంబంధించినవి మాత్రమే తోడవుతాయి. ప్రస్తుత రాజకీయాలు హిందూ రాష్ర్ట ఏర్పాటుకు హిందూత్వ చరిత్రకు అనుకూలంగా ఉన్నాయి.

ఆధునిక శాస్త్ర విజ్ఞాన విజయాలు వేలాది సంవత్సరాల క్రితమే హిందువులకు తెలుసునని అంటున్నారు. విమానాలు ఆకాశంలో పయనించడం, వినాయకుడికి ఏనుగు తలను తీసుకొచ్చి అతికించడం వంటి ప్లాస్టిక్ సర్జరీలు, కౌరవుల జననానికి సంబంధించి మూలకణాల మార్పిడి వంటి అపురూపమైన విషయాలు వీరికి తోడవుతున్నాయి. వీటిలో ఏ ఒక్కటి సాక్ష్యాలతో రుజువు అయినవి కావు. శిక్షణ పొందిన నిజమైన శాస్త్రీయ చరిత్రకారులకు, ఈ చరిత్రకారులకు మధ్య తేడాను ఇవి చూపిస్తాయి.

ప్రశ్న: కొందరు విద్యావేత్తలు, రాజకీయ నాయకులు ఆర్యజాతిని సొంతం చేసుకుని, వారి స్వయం సమృద్ధి గురించి ఎందుకు కీర్తిస్తున్నారు?
రొమిల్లా: వలస పాలకులకు ముందు కాలంలో, కొందరు ఆర్య భాష నుంచి జనించిన జ్ఞానంతో సామాజికంగా విలువైన వారుగా గుర్తింపు పొందారు. రాజును ‘ఆర్యపుత్ర’ అని సంబోధించే వారు. పురాతన ఇరాన్ ఆర్య సంస్కృతిలోని పర్షియన్ సామ్రాజ్యంలో ప్రసిద్ధి చెందిన అచెమెనిడ్ వంశ పాలకులు ఆర్యులుగా, ఆర్యభాష మాట్లాడేవారుగా గౌరవాన్ని పొందారు. వారికి రుగ్వేదంతో సంబంధాలున్నట్టు ఇరాన్ పురాతన గ్రంథాల ద్వారా తెలియడం చాలా ఆసక్తికరం.

పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల గురించి జరిగిన అధ్యయనంలో ‘జాతి’ అన్న పదానికి ప్రాధాన్యత వచ్చి, దానికి ‘జాతి విజ్ఞానం’ అని నామకరణం చేశారు. నిచ్చెన మెట్ల సోపానంలో ప్రజలను జాతుల కింద విభజించారు. వీటిలో ఆర్య అనే దానికి ఉన్నత స్థానం కల్పించారు. హిట్లర్ దీన్ని ఒక భయంకరమైన సిద్ధాంతంగా చేయడమేకుండా, ముస్సోలినీ ఫాసిజం కూడా ఈ నాజీజాన్ని సమర్థించింది. ఈ మార్గంతో పూర్తిగా మమేకమైన బిఎస్ మూన్జే వంటి వారు భారతీయులను హిందుత్వానికి జత చేశారు. దీనికి తోడు వలసవాద పండితులు ఆర్యులు ఉన్నతులని కీర్తించారు. భారతీయ సందర్భంలో ఇండో ఆర్యన్ సంస్కృతికి దీనికి దగ్గర పోలికలు ఉన్నాయని బ్రిటిష్ వారి సంస్కృతి భావించింది. ఇండో ఆర్యన్ భాషల ఉపన్యాసకులు సంస్కృతం హిందువుల మత భాష అని, హిందూ మతానికి వైదిక బ్రాహ్మణీకం మూలమని సూత్రీకరించారు.
భారత దేశం భారతీయుల పూర్వీకుల జన్మభూమి ‘పితృభూమి’ అని సావర్కార్ నిర్వచించాడు. ఈ పుణ్యభూమిలోనే తమ మతం విరాజిల్లిందని అన్నాడు. కనుక ఆర్యులు భారత దేశంలోనే సంఘటితం కావాలి. ఆర్యభాష మాట్లాడే వారు మధ్య ఆసియా నుంచి భారత దేశానికి వలస వచ్చారనే వాదాన్ని తిరస్కరిస్తూ, ఆర్యులు మాతృభూమి భారత దేశమేనని ఒక నిరాశావహ అన్వేషణ చేశాడు.

ప్రశ్న: వలసవాద వ్యతిరేక స్వభావం కలదిగా జాతీయ సంస్క ృతిని సృష్టించారు. ఇప్పుడది ఎలా హిందూ రాష్ర్టంగా అభివృద్ధి చెందింది?
రొమిల్లా: చారిత్రకంగా భారత దేశంలో జాతీయ వాదం రెండు రకాలుగా ఉంది. తొలి రోజుల్లో అది చాలా పెద్దదిగా, అందరినీ కలుపుకుపోయేలా ఉండడమే కాకుండా 19వ శతాబ్దంలో అన్ని వర్గాల్లో ఎక్కువ మంది భారతీయులు దానికి మద్దతుగా నిలిచారు. జాతీయోద్యమానికి జాతీయవాదంగా దాన్ని కొనియాడారు. ఒక ఉద్యమంగా అది కులం, మతం, భాషా, వర్గ భేదాలు లేకుండా ప్రతి భారతీయుడిని కలుపుకుపోయింది. భారత దేశాన్ని వలసవాద పాలన నుంచి విముక్తి చేసి, స్వేచ్ఛగా ఒక స్వతంత్ర దేశంగా నిలబెట్టడమే దాని ధ్యేయంగా పని చేసింది. దీన్ని నేను అందరినీ కలుపుకుపోయే సమగ్రమైన జాతీయ వాదంగా భావిస్తాను.

ఒక జాతి 1947లో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఈ జాతీయ వాద స్వభావం ఏమిటంటే, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం అనేవి పౌరుల్లో సమానత్వాన్ని తీసుకు రావడానికి ఉపయుక్తమవుతాయి. మత జాతీయ వాదమనే మరొక సమగ్ర జాతీయ వాదం కూడా పుట్టుకొచ్చింది. దీనికి ఒక రూపాన్నివ్వడానికి 1920 తరువాత, 1930కి ముందు రెండు ఉద్యమాలు మొదలయ్యాయి. తమది జాతీయ వాదమని చెప్పుకున్నప్పటికీ, వీరు ఒకే మతం అనే ప్రాతిపదికగా పరిమితమైన అధిక సంఖ్యాకులు.

భారత దేశంలో అధిక సంఖ్యాకులున్న మతంగా హిందువుల గుర్తింపు, అధిక సంఖ్యాకులున్న అతిపెద్ద అల్ప సంఖ్యాక మతంగా ముస్లింల గుర్తింపు. ఈ ఇద్దరిలో కూడా వలసవాద శక్తిని వ్యతిరేకించడంలో ఏకీభావం ఉంది. వలసవాద పాలకులు వెళ్ళిపోయాక ఉభయులు తమతమ దేశాలను ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. దాంట్లో ఒకటి అల్పసంఖ్యాక మతాలలో ఉన్న అధిక సంఖ్యాకులైన ముస్లింలు పాకిస్థాన్‌గా ఏర్పడాలని, మరొకరు జనాభాలో అధిక సంఖ్యాకులైన హిందువులతో హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని భావించారు.

ప్రశ్న: ఇది ఎలా వచ్చింది?
రొమిల్లా: వలసవాద రచనల్లో భారతీయ గతాన్ని చదవడం వల్ల ఈ ఆలోచనలు పుట్టుకొచ్చాయి. బ్రిటిష్ పాలనకు ముందు భారతీయులకు చరిత్ర లేనట్టుగానే, ఆధునిక భారత దేశానికి ముందు భారతీయులకు చారిత్రక దృక్పథం అసలు లేనే లేదని వలసవాద పండితులు వాదిస్తూ వచ్చారు. భారత దేశాన్ని అన్వేషిస్తూ ఇక్కడ హిందు ముస్లిం అనే రెండు మతపరమైన జాతులు ఉన్నాయన్న సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఈ సిద్ధాంతం చరిత్రను అధిగమించేసి ఒకరంటే ఒకరికి పడకుండా వైరాలు సృష్టించింది. మత ప్రాతిపదికగా రెండు జాతుల సిద్ధాంతాన్ని వివిధ పార్టీలు సమర్థించాయి. ముస్లిం జాతీయ వాదాన్ని ముస్లిం లీగ్ సమర్థించగా, హిందూ జాతీయ వాదాన్ని హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వంటివి సమర్థించాయి. మతజాతీయ వాదాలనే గూళ్ళను అల్లడానికి ఈ వలసవాద పక్షులు తమ తమ నివాసాలలోకి వచ్చాయి.
సమైక్యంలో ఒక వైరుధ్యం ఏమిటంటే, సమగ్ర జాతీయ వాదం, మత జాతీయ వాదం అని వాటిని వేరు చేస్తూ నిర్వచించారు.

మత జాతీయ వాదం అనేది సహ మతస్థుల పార్టీ. ఎందుకంటే అది ఇతర మతస్థుల నుంచి తనను తాను వేరు చేసుకుంటుంది. దాన్ని వేరు పడిన జాతీయ వాదం అని అనడం సరిగ్గా సరిపోతుంది. హిందూ జాతీయవాదం విషయంలో జనాభా రీత్యా అధిక సంఖ్యాకులైన తమకు చెందిన ఒకే ఒక మతస్థులతో ఒక జాతీయ దేశాన్ని ఏర్పాటు చేయాలనేది వీరి ఆలోచన. ఒక జాతీయ వాద దేశానికి ఆచరణలో ఉండవలసిన ప్రజాస్వామిక, లౌకిక వాదం అనే అవసరమైన లక్షణాలు దీనితో విభేదిస్తాయి. ప్రజాస్వామిక లౌకిక విధానంతో లేకపోయినట్టయితే, ఇలాంటి రాజ్యాలు రాజకీయ నియంతృత్వాలుగా మారే ప్రమాదం ఏర్పడుతుంది.

రాఘవశర్మ(అనువాదం)- 9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News