నల్గొండ : తెలంగాణ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతను జోడించి సాధించిన రాష్ట్ర అభివృద్ధ్దికి దార్శనికుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ పట్టణంలోని పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహా రుద్రాభిషేకం,పాశుపత హోమ సహిత రాజ శ్యామల యాగంను నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి కి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదం లతో పాటు ఆశీర్వచనం అంద చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2014కు ముందు 20 నుండి 40 సంవత్సరాల వెనుకకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఉండేవన్నారు. వందల, వేల సంవత్సరాలకు పూర్వం నిర్మింపబడిన దేవాలయాలు ఆనాటి పాలకుల పూర్తి నిర్లక్ష్యం, నిరాదరణ కారణంగా శిథిలావస్థకు చేరుకొని ధూప దీప నైవేద్యాలకు నోచని పరిస్థితి ఉందని అన్నారు. సమాజం పట్ల ఆదరణ లేక ఆధ్యాత్మిక వ్యవస్థ దెబ్బతిన్నది అన్నారు.
ఆందోళనలు, ఆకలి చావులు, కరువు కాటకాలను ఎదుర్కొన్న ప్రాంతం మనది అన్నారు. 2014 తెలంగాణ ఏర్పడ్డాక దేవాలయాల స్థితిగతులు మారాలి, ఆధ్యాత్మికత పెంపొందాలి, ప్రజలు బాగుండాలి అని ముఖ్యమంత్రి హిందువుల దేవాలయాలతో పాటు ఇతర మత ఆచారాలను,సాంప్ర దాయాలను కూడా గౌరవించుకోవాలని అందరూ కలిసి పండుగలు జరుపు కొవాలని అన్ని మతాలను గౌరవించి పండుగలను జరుపుకుంటున్నట్లు, సుహృద్భావ వాతావరణంతో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందని అన్నారు. కె.సి.అర్ ఉద్యమ నాయకుడు పరిపాలన చేయగలడా అని సంద్ధించరని, అలాంటి వారందరూ 9 సం.ల లో పరిపాలన చూసి అసూయ పడేలా కెసిఆర్ నిజమైన పరిపాలకుడు అని కితాబు ఇస్తున్నారు అని తెలిపారు. కరవుతో ఆకలి చావులు ఉన్న ఒకప్పటి తెలంగాణ నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది అని అన్నారు.
హైదరాబాద్ గంగా, యమునా తహజీ బ్ అన్న గాంధీ మాటలను నిజం చేసిన ఘనత కెసిఆర్ ది అన్నారు. తెలంగాణ ఆచరిస్తున్నది దేశం అనుసరిస్తున్నది అన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని కేసీఆర్‌కి ఆశీర్వచనాలు,ఆశీస్సులు అందిస్తున్నారని అన్నారు. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నుంచి ఐదువేల దేవాలయాలు ధూప దీపం లేక పడావు పడ్డాయి అన్నారు. దేవాలయంలో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని భావించి కెసిఆర్ ముఖ్యమైన దేవాలయాలు పూజకు నోచుకోని దేవాలయాలను గుర్తించి దూప దీపం జరిగేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. యాదాద్రి దేవాలయం నిర్మాణం చరిత్రలో ఎవ్వరికీ ఇవ్వని శక్తిని ఆ భగవంతుడు కేసిఆర్ కు అందించినందుననే యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారన్నారు.
ఛాయా సోమేశ్వర దేవాలయం శిధిలావస్థలో ఉంటే దానికి పూర్వవైభవం తేవడానికి కృష్ణ పుష్కరాలలో భాగంగా జిల్లా మంత్రి చొరవతో నాలుగు కోట్ల రూపాయలతో దేవాలయం అభివృద్ధి, కోనేరు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో భాగంగా ధూపదీప నైవేద్యాల కింద నల్లగొండ నియోజకవర్గంలో ఎంపికైన 26 దేవాలయ అర్చకులకు ఆర్థిక సహాయం మంజూరు ఉత్తర్వులను మంత్రి చేతుల మీదుగా అందించారు.
అదేవిధంగా వేద పాఠశాలకు,బ్రాహ్మణ పరిషత్తు భూ కేటాయింపు చేసిన ఉత్తర్వులను మంత్రి చేతుల మీదుగా వేద పాఠశాల నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ , ఆలయ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి, పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు,దేవాదాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, టిఆర్‌ఎస్ అధికార ప్రతినిధి సంధినేని జనార్దన్ రావు, స్థానిక కౌన్సిలర్లు బుర్రి రజిత, ఆలకుంట్ల రాజేశ్వరి, వివిధ ఆలయాల అర్చకులు తదితరులు పాల్గొన్నారు.