ముంబై : కరోనా సమయంలో వైద్య సదుపాయాలు, మెడిసిన్స్, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. ఈ నేపథ్యంలో ముంబై మహానగర పాలక సంస్థ బీఎంసీలో జరిగిన ఫీల్డ్ ఆస్పత్రుల రూ. 12 వేల కోట్ల స్కామ్‌కు సంబంధించి ఐఎఎస్ అధికారి సంజీవ్ జైస్వాల్ ఇంటితో సహా శివసేన (యూబిటి )నేతలు ఆదిత్య థాక్రే, సంజయ్ రౌత్ సన్నిహితుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది.
థాకరే సన్నిహితుడు సూరజ్ చౌహాన్ , ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు సుజిత్ పాట్కర్ ఇళ్లు సహాథానే, నవీ ముంబై పరిసరాల్లో మొత్తం 15 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జైస్వాల్ గతంలో థానే మున్సిపల్ కమిషనర్‌గా, కొవిడ్ సమయంలో బీఎంసి అదనపు కమిషనర్‌గా పనిచేశారు. దీంతో ఆయన ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. జనవరిలో బిఎంసి కమిషనర్ ఐఎస్ చాహల్ స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేసింది. ఫీల్డ్ హాస్పిటల్ కాంట్రాక్టు కేటాయింపు ప్రక్రియ సంబంధిత వివరాలను ఇవ్వాలని కోరింది.
ఈ కేసులో బీఎంసి కమిషనర్ చాహల్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. ఎంపి సంజయ్ రౌత్ సన్నిహితుడైన సుజిత్ పాట్కర్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కొవిడ్ సమయంలో హెల్త్ కేర్ ఫీల్డ్‌లో అనుభవం లేని కొవిడ్ ఫీల్డ్ ఆస్పత్రులతో పాట్కర్ ఒప్పందం చేసుకున్నారు. దీనిపై గత ఏడాది బీజేపీ నేత కీర్తి సోమయ్య ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా లైఫ్‌లైన్ మేనేజిమెంట్ సర్వీసెస్ , పాట్‌కర్, అతడి ముగ్గురు సన్నిహితులపై కేసులు నమోదు చేశారు. తప్పుడు విధానంలో వీరు ఫీల్డ్ ఆస్పత్రుల కాంట్రాక్టులు దక్కించుకున్నారని అభియోగాలు వచ్చాయి.