వనపర్తి : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలని, ప్రశాంతమైన విలువలతో కూడిన జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం వనపర్తి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి పూజలు నిర్వహిచారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషికి విలువలతో కూడిన గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ఆధ్యాత్మిక గ్రంథాలు ఎంతో దోహదపడుతాయన్నారు. దేవాలయానికి వెళ్లినప్పుడు మానసిక ప్రశాంతత కలుగుతుందని, వీటితో పాటు హరికథలు, పురాణ ప్రవచనాల ద్వారా ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, పండుగల ప్రాముఖ్యత తెలుసుకోవడం ద్వారా విషయ పరిఙ్ఞానం పొందవచ్చునని ఆయన అన్నారు.
మనిషి మరొకరిపట్ల స్నేహ భావాన్ని పుంపొం దించుకుని, ఎదుటివారికి సహాయపడాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వివిధ దేవాలయాలలో నిత్య పూజ, ధూప, దీప నైవేద్యాలు అందిస్తున్న 24 మంది అర్చకులకు జిల్లా కలెక్టర్ ప్రొసిడింగ్‌లను అందజేశారు. వీరికి ప్రతి నెల 6 వేల మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.