Monday, December 23, 2024

బంగారు బోనమెత్తిన దేశ రాజధాని

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : దేశా రాజధాని బంగారు బోనమెత్తింది. తెలంగాణ రాష్ట్ర పండగైన బోనాల ఉత్సవాలు ఢిల్లీ వీధుల్లో సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింభింపజేశాయి. పోతరాజు వీరంగం…శివశత్తుల పూనకాలు…సాంప్రదాయ బోనాలు,బంగారు బోనం, కళాకారుల నృత్యాలు, ఢిల్లీ వీధుల్లో జనాలను కట్టిపడేశాయి. ఔరా..! తెలంగాణ బోనాల పండగంటే ఇంత ఘనంగా చేసుకుంటారాని ఢిల్లీ ప్రజలు ఆశ్చర్యపోయారు.

పాతబస్తీ లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవనలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల చివరి రోజైన బుధవారం పోతరాజు స్వాగతం, బోనాల సమర్పణ, పలువురు ప్రముఖులు సందర్శన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పోతరాజు పోసాని సుధాకర్ ముదిరాజ్ తన విన్యాసాలను ఆకట్టుకున్నారు. భవన్ ఆవరణలో ఓగ్గు డోలు మోతలు, పోతరాజు వీరంగం మధ్య బంగారు బోనం, సాంప్రదాయ బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కె.సురేష్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితర ప్రముఖులు అమ్మవారి చిత్రం, ఘటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. బంగారు బోనాన్ని తలపై పెట్టుకొని అమ్మవారికి సమర్పించారు. ఆలయ నిర్వాహకులు వారిని శాలువతో ఘనంగా సన్మానించారు. దీంతో ఈనెల 19న ప్రారంభమైన ఢిల్లీ బోనాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు సి.రాజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బి.మారుతీ యాదవ్, కోశాధికారి పోసాని సదానంద్ ముదిరాజ్, మాజీ చైర్మన్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News